పత్తి జిగేల్‌.. మిర్చి ఢమాల్‌

ABN , First Publish Date - 2021-11-02T05:43:27+05:30 IST

పత్తి జిగేల్‌.. మిర్చి ఢమాల్‌

పత్తి జిగేల్‌.. మిర్చి ఢమాల్‌
ఖమ్మం మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన ఏసీ మిర్చి బస్తాలు

మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న పత్తి ధరలు

అంతకంతకూ తగ్గుతున్న ఏసీ మిర్చి రేటు

ఆనందంలో దూది రైతులు, ఆందోళనలో మిర్చి రైతులు

ఖమ్మం మార్కెట్‌/ఏన్కూరు, నవంబరు 1: ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి, మిర్చి పంటలకు లభిస్తున్న ధరలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో పత్తి ధర రోజురోజుకు పెరుగుతుండగా ఏసీ మిర్చి ధర మాత్రం భారీగా పడిపోతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి ధర రూ.8,400 పలకగా ఏసీ మిర్చిని జెండాపాట రూ.12,600లుగా నిర్ణయించారు. గత కొంత కాలంగా మార్కెట్‌లో ఏసీ మిర్చి ధరలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం తగ్గిపోయాయి. గతేడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో క్వింటా ఏసీ మిర్చి రూ.20,000 నుంచి రూ.21,500 వరకు పలకగా ఈ ఏడాది రూ.12,000కు ధర పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. గతేడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో సాధారణ తేజా రకం మిర్చి క్వింటాకు రూ.12,000 నుంచి రూ.13,500 వరకు ధర ఉండగా గిట్టుబాటు కావట్లేదని భావించి జిల్లా వ్యాప్తంగా అనేకమంది రైతులు కోల్డ్‌స్టోరేజీలలో సుమారు 30లక్షల మిర్చి బస్తాలను నిల్వ చేశారు. కానీ వారి అంచనాలు తప్పాయి. ప్రస్తుతం ఏసీ మిర్చికి దక్కుతున్న ధరలు వారి ఆశలను ఆవిరి చేశాయి. గతేడాది మిర్చి ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది జిల్లాలో మిర్చి సాగును భారీగా పెంచారు. ఈ క్రమంలో పత్తి సాగు తగ్గించారు. ఈ పరిస్థితి పత్తి రైతులకు కలిసిరాగా మిర్చి రైతుల అంచనాలను మాత్రం దెబ్బ తీసింది. ప్రస్తుతం ఏసీ మిర్చికి దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ లేకపోవడంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. త్వరలోనే కొత్త మిర్చి మార్కెట్‌కు రానున్న నేపథ్యంలో ధరల పరిస్థితిపై రైతులు మరింత  ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం మార్కెట్‌కు సోమవారం సుమారు 9వేల బస్తాల పత్తి, 2వేల బస్తాల ఏసీ మిర్చి అమ్మకానికి వచ్చింది. పత్తి కొనుగోళ్లను మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ డౌలే లక్ష్మీ ప్రసన్న, సెక్రెటరీ రుధ్రాక్షల మల్లేశం, ఏఎస్‌ రాజేంద్రప్రసాద్‌లు సమీక్షించారు. ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో పత్తి ధర సోమవారం రికార్డు స్థాయికి చేరింది. ఏన్కూరు ఏఎంసీకి అనుబంధంగా ఉన్న జూలూరుపాడు సబ్‌మార్కెట్‌యార్డులో పత్తి ధర రూ.8370, ఏన్కూరు ఏఎంసీలో రూ.8250లు పలికింది.  



Updated Date - 2021-11-02T05:43:27+05:30 IST