ప్రశాంత ఓటింగ్‌కు సహకరించాలి
ABN , First Publish Date - 2021-12-09T06:03:46+05:30 IST
ప్రశాంత ఓటింగ్‌కు సహకరించాలి

ఎమ్మెల్సీ అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులతో ఖమ్మం కలెక్టర్, సీపీ సమీక్ష
ఖమ్మం కలెక్టరేట్, డిసెంబరు 8: ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి శుక్రవారం జరిగే పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని ఖమ్మం కలెక్టర్, ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ బరిలో ఉన్న అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పోలింగ్ ప్రక్రియ గురించి వివరించారు. అందరూ ఎన్నికల ప్రవర్తనా నియ మావళిని పాటించాలని సూచించిన ఆయన పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించిన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సుల వివరాలు అభ్యర్థులకు తెలిపారు. నగరంలోని డీపీఆర్సీ భవనంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి గురువారం పోలింగ్ సామగ్రితో పోలింగ్ సిబ్బంది, కేంద్రాలకు చేరుకుంటారని చేరకుంటారన్నారు. 10న పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రిని స్ర్టాంగ్‌రూంకు తరలిస్తామని, 14న పటిష్ట బందోబస్తు, కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తల మధ్య కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థి, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లు విధిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని, అందుకు తగిన ధ్రువీకరణ చూపా లన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి సెక్టార్ మెజిస్ర్టేట్‌ను నియమించినట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా బుధవారం సాయంత్రం 4గంటల నుంచి డ్రైడే అమలులో ఉందని పోలింగ్ లొకేషన్లలో ప్రత్యేక క్లాక్ రూంలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేముందు సెల్‌ఫోన్లు, పెన్నులు ఇతర వస్తువులు క్లాక్‌రూంలో అప్పగించి ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని ఏదైనా సమస్య ఉంటే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, నోడల్ అధికారి వింజం వెంకట అప్పారావు, ఎమ్మెల్సీ అభ్యర్థులు రాయల నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీనివాసరావు, అభ్యర్థుల ప్రతినిధులు నల్లమల వెంకటేశ్వరరావు, కన్నారావు, ఎన్నిక ల డీటీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.