అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్న మంత్రి పువ్వాడ
ABN , First Publish Date - 2021-02-06T05:30:00+05:30 IST
రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన మంత్రి పదవిని ప్రజాప్రయోజనాలకు వాడకుండా సొంత ప్రయోజనాలకు వాడుతూ అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నాని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.

జీవోను అడ్డంపెట్టుకుని భూముల క్రమబద్దీకరణ
సొంత కాంట్రాక్టు సంస్థకే పనులు
నేడు ఖమ్మంలో కాంగ్రెస్ సమావేశం
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన మంత్రి పదవిని ప్రజాప్రయోజనాలకు వాడకుండా సొంత ప్రయోజనాలకు వాడుతూ అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నాని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకోసం ప్రభుత్వం క్రమబద్దీకరణ జీవోలు ఇస్తే మంత్రి పువ్వాడ తాను ఆక్రమించుకున్న భూములను క్రమబద్ధీకరించుకున్నారన్నారు. తన కాంట్రాక్టు సంస్థకే ప్రభుత్వ పనులు కేటాయించుకుంటున్నారని, లేదంటే తాను సూచించిన వారకే ఇవ్వాలని బెదరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. పేదల కోసం ఇచ్చిన జీవో 58, 59ను అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా భూములు క్రమబద్దీకరించుకుంటున్నారని ఆరోపించారు. ఖమ్మం నగరంలో అభివృద్ధి పనుల పేరుతో భారీగా అవినీతి జరుగుతోందన్నారు. నాణ్యతలేకుండా జరుగుతున్న నిర్మాణాపై విజిలెన్సు విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలతో విజిలెన్సుకు ఫిర్యాదు చేయబోతున్నట్టు భట్టి ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర రైతుచట్టాలను రద్దుచేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎల్పీ తరుపున సీఎం కేసీఆర్‌కు లేఖరాస్తే స్పందించలేదన్నారు. అందుకే సీఎల్పీ పక్షాన రైతుయాత్ర చేపడుతున్నామని తెలిపారు. ఖమ్మంకార్పొరేషన్‌తో పాటు త్వరలో జరుగుతున్న పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మణిక్క ఠాగూర్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు హాజరవుతున్నారని తెలిపారు. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ఖమ్మంలో ఆదివారం ఆందోళన నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జావిద్, వర్కింగ్‌ప్రెసిడెంట్ దీపక్‌చౌదరి, కార్పొరేటర్ బాలగంగాధర్‌తిలక్, పుచ్చకాయల వీరభద్రం, మలీదు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, యర్రబోయిన శ్రీను, మొక్కశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.