ముగిసిన పీఎల్‌జీఏ వారోత్సవాలు

ABN , First Publish Date - 2021-12-09T05:17:41+05:30 IST

ఏటా డిసెంబరు రెండు తేదీ నుంచి ఎనిమిది వరకు మావోయిస్టులు నిర్వహించే పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి.

ముగిసిన పీఎల్‌జీఏ వారోత్సవాలు

 ఊపిరి పీల్చుకున్న పోలీసు యంత్రాంగం

దుమ్ముగూడెం డిసెంబరు 8: ఏటా డిసెంబరు రెండు తేదీ నుంచి ఎనిమిది వరకు మావోయిస్టులు నిర్వహించే పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. మావోయిస్టు అగ్ర నాయకత్వంతోపాటు, పలువురు ముఖ్య నేతలు కరోనా, ఇతర కారణాలతో  మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిక్రూట్‌మెంటు కోసం మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ఇంటిలిజెన్సు సమాచారం మేరకు పోలీసు బలగాలు పూర్తి అప్రమత్త మయ్యాయి. మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సరిహద్దు కావడంతోపాటు మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు విస్తృత కూంబింగ్‌ నిర్వహించారు. వాహన తనిఖీలను చేపట్టారు. భద్రాచలం నుంచి చర్లకు వెళ్లే రాత్రి సర్వీసులను సైతం రద్దు చేశారు. మారుమూల అటవీప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సైతం ఆపివేశారు. యంత్రాలను మైదాన ప్రాంతాలకు తరలించారు. టార్గెట్లను హెచ్చరించడంతో పాటు, వారిని మైదానప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించే కొన్ని వారాంతపు సంతలకు మాత్రం వ్యాపారులు యదావిధిగా వెళ్లారు. ఎట్టకేలకు పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

వారోత్సవాల నడుమ గొత్తికోయలకు దుప్పట్ల పంపిణీ

దుమ్ముగూడెం: మావోయిస్టు పీఎల్‌జీఓ వారోత్సవాల చివరి రోజైన బుధవారం ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు గ్రామం ముల్కనాపల్లి గొత్తికోయల గ్రామంలో ఏఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ పర్యటించారు. అక్కడ నివసిస్తున్న తొంబైమంది గొత్తికోయ కుటుంబాలకు దుప్పట్లను అందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, ఏజన్సీ ప్రాంత ఆదివాసీల  సంక్షేమమే పోలీసు ధ్యేయమని అన్నారు. వారి సమస్యలను తెలుసుకున్న ఏఎస్పీ సంబందిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, సీఆర్‌పీఎఫ్‌ 141 బెటాలియన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:17:41+05:30 IST