మాజీ ఎమ్మెల్యే కాశయ్య కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-26T05:47:31+05:30 IST

మాజీ ఎమ్మెల్యే కాశయ్య కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కాశయ్య కన్నుమూత

ఉమ్మడి జిల్లా రాజకీయభీష్ముడిగా తనదైన ముద్ర

రెండు సార్లు కొత్తగూడెం శాసనసభ్యుడిగా, జడ్పీచైర్మన్‌గా ప్రాతినిధ్యం

గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమంలో.. 

ఖమ్మం/కొత్తగూడెం, మే 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): సీనియర్‌ రాజకీయవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, గురుదక్షిణ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌, తెలంగాణ తొలి తరం ఉద్యమ నేతగా, ఖమ్మం పెద్దాయనగా పేరున్న ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన చేకూరి కాశయ్య (88) కన్ను మూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌ లోని కుమారుడి నివాసంలో  ఉంటున్న ఆయన సోమవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. కాశయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.  ఖమ్మం జిల్లా పూర్వ మధిర తాలుకా ప్రస్తుత ఎర్రుపాలెం మండలం తక్కెల్లపాడు గ్రామంలో 1936లో చేకూరి నర్సయ్య, భాగ్యమ్మ దంపతులకు జన్మించిన కాశ య్యకు భార్య లలిత, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేసి మృతిచెందారు. మదిర హైస్కూల్‌లో ఉర్దూమీడియం చదివిన కాశయ్య విద్యార్థి దశ నుంచే గాంధీజీ పట్ల, ఆయన ఆశ యాలపట్ల మక్కువ పెంచుకున్నారు. గాంధీజీ మధిర రైల్వేస్టేషన్‌లో ఆగిన సమ యంలో ఆయన ప్రసంగం విన్న కాశయ్య ఆయన స్ఫూర్తితో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొ న్నారు. ఆతర్వాత నిజాంకు వ్యతిరేకంగా విద్యార్థి నేతగా ఉద్యమించారు. నిజాం కాలేజీలో 1956లో బీఏ పాసైన 1952-56లో విద్యార్థి సంఘం నాయకుడిగా గుర్తింపు పొందారు. 1950నుంచి1960వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశా రు. 1960లో కొత్తగూడెం పంచాయతీ సమితి విస్తరణాధికారిగా పనిచేస్తూ 1964 ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించారు. కొత్తగూడెంలో సమితి అధ్యక్షుడిగా ఎన్నికై 1972లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచారు. 1978లో జనతపార్టీనుంచి ఎమ్మల్యేగా గెలిచారు. నీలం సంజీవరెడ్డి ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రజాసమితి పార్టీనుంచి ఖమ్మం ఎంపీగా పోటీచేసి తేళ్ల లక్ష్మీకాంతమ్మ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి కీలక పదవులు చేపట్టినా 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఆహ్వానం మేరకు అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో టీడీపీలో చేరారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కేంద్రమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు కుమా రుడు జలగం ప్రసాదరావుపై టీడీపీ నుంచి పోటీచేసిన కాశయ్య విజయం సాధించారు. ఆ తర్వాత పీవీ నర్సింహారావు ప్రధాని అయిన తర్వాత ఆయనతో ఉన్న మిత్ర బంధం నేపథ్యంలో కాంగ్రెస్‌ లో చేరి.. 1994లో సుజాతనగర్‌నుంచి కాంగ్రెస్‌అభ్యర్థిగా పోటీచేసి ఓటమిచెందారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాశయ్య ఖమ్మంలో గురుదక్షిణ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి ప్రకృతి ఆశ్రమాన్ని, ప్రకృతి వైద్యశాలను ఏర్పాటుచేశారు. ఖమ్మంలో కమ్మ హాస్టల్‌ ఏర్పాటు, కమ్మవారి కల్యాణ మండపం నిర్మాణంలోనూకీలకంగా వ్యవహరించారు. కొంతకాలంగా వృద్ధాప్యం, క్యాన్సర్‌తో బాధపడుతున్న కాశయ్య హైదరాబాద్‌లోని తన కుమా రుడి వద్ద ఉంటూ చికిత్సతీసుకుంటూ కన్నుమూయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లావాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో మూడున్నర దశబ్దాలుగా రాజకీయ చక్రం తిప్పుతున్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చేకూరి కాశయ్య రాజకీయ గురువు. కాశయ్య సూచనలు, సలహాలతోనే తుమ్మల రాజకీయాల్లో రాణిస్తూ వచ్చారు. కాశయ్య అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ఖమ్మంలోని గురుదక్షిణ ఫౌండేషన్‌ ఆవరణలో నిర్వహించారు.

నెరవేరని ఎంపీ కల..

అయితే రెండుసార్లు కొత్తగూడెం ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాశయ్య.. తాను ఏనాటికైనా ఖమ్మం ఎంపీగా గెలిచి లోక్‌సభలో తన గళాన్ని వినిపించాలని ఉందని చెప్పేవారు. కానీ ఆయన కల నెరవేరకుండానే దివికేగారు. సాధారణ రైతుకుటుంబంలో పుట్టిన కాశయ్య అంచలంచెలుగా ఎదిగారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి లాంటి నేతలతో స్నేహసంబంధాలు కలిగిన చేకూరి కాశయ్య స్నేహానికి విలువిచ్చే మిత్రుడిగా, మానవ సంబంధాలే అనుబంధాలని అని నమ్మి నడిచారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఖద్దరు వస్త్రాలు ధరిస్తూ చివరి వరకు నిరాడంబర జీవితాన్ని గడిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో సొంత డబ్బు రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ప్రజలనుంచే నామినేషన్‌ డిపాజిట్‌ కోసం విరాళాలు తీసుకున్నారు. ప్రచారాన్ని కూడా నిరాడంబరంగా నిర్వహించేవారు. చివరి వరకు సొంత వాహనంకూడా లేకుండా, ఎక్కడికి వెళ్లినాఎక్కువగా కాలినడకనే వెళ్లడం ఆయన ప్రత్యేకత. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్‌తో పలుభాషలను మాట్లాడగలగడం, ఎన్నో స్టేజీలపై తన అనర్గళ ప్రసంగంతో ఆకట్టుకోవడం కాశయ్య ప్రత్యేకత.  

జలగంపై అలుపెరగని పోరాటం..

జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పై.. శీలం సిద్దారెడ్డి వర్గం నుంచి అలుపెరగని పోరాటం చేశారు కాశయ్య. వెంగళరావు అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ పోరాటం చేసి ప్రత్యేక కమిషన్‌ను నియమించి విచారణ జరిగేలా పట్టుబట్టి.. స్వపక్షంలో విపక్ష నేతగా చర్చనీయాంశమయ్యారు. కాశయ్య. మొదట్లో జలగం వెంగళరావుకు అనుకూలంగా ఉన్నారు. ఆ తర్వాత సిద్దారెడ్డిగ్రూపులో చేరి కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. జాతీయ, రాష్ట్ర నేతలతో స్నేహసంబంధాలు నెరిపిన చేకూరి.. రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా వారిని నేరుగా తీసుకెళ్లి పరిష్కరించేవారు. 

ఉపరాష్ట్రపతి, సీఎం కేసీఆర్‌ సహా పలువురి సంతాపం

ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్‌, స్వాతంత్య్ర సమరయోధుడు చేకూరి కాశయ్య మృతికి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-05-26T05:47:31+05:30 IST