చౌక భోజనం చేదు
ABN , First Publish Date - 2021-10-30T04:01:45+05:30 IST
చౌక భోజనం చేదు
మహిళా సంఘాల వంటశాలకు మంగళం
హోటళ్ల నుంచి అధిక భోజన బిల్లులు
రెండేళ్లుగా వెలగని జిల్లా సమాఖ్య వంటశాల
టీటీడీసీ భోజనశాల ప్రారంభానికి ఎస్‌హెచ్‌జీల డిమాండ్
ఖమ్మం సంక్షేమవిభాగం, అక్టోబరు 29: కమీషన్ల రుచికి అలవాటు పడిన అధికారులకు మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన భోజనం నచ్చడం లేదు. చౌకగా శుచి, శుభ్రతతో నోరూరించే వంటకాలు అందించినా ససేమిరా అంటున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని శిక్షణ, సాంకేతిక అభివృద్ధి కేంద్రం(టీటీడీసీ)లో ఉన్న మహిళా సమాఖ్యల వంటశాల మూతపడింది. ఫలితంగా బయట హోటళ్ల నుంచి అధిక ధరలకు బిల్లులు తీసుకువస్తున్న పలువురు బ్రేవుమని తేన్చుతున్నారు.
బిల్లుల భోజనం భలేరుచి..!
‘చేతి వృత్తుల నుంచి మధ్యతరహా పరిశ్రమల వరకు రాష్ట్రంలో మహిళా స్వయం సంఘాలకు అన్ని రకాల సహాయ సహరారాలు అందిస్తున్నాం...’ తాజాగా ఖమ్మం టీటీడీసీలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో సెర్ప్ డైరెక్టర్ వై. నర్సింహారెడ్డి పలికిన పలుకులు. కాని ఆదే టీటీడీసీలో మహిళా స్వయం సంఘాల అధ్వర్యంలో ఎంతో రుచికరంగా ఇంటిభోజనాన్ని తలపిస్తూ తక్కువ ధరలకే భోజనాల నుంచి టీ వరకు ఆహారం తయారు చేసే టీటీడీసీ వంటశాలలో మాత్రం పొయ్యి వెలగటం లేదు. బిల్లుల భోజనానికి అలవాటు పడిన కొన్ని విభాగాల బాధ్యులు చిన్న కారణాలను చూపుతూ రెండేళ్లుగా టీటీడీసీలో వంటశాలను మూసి వేయించారు. అయితే ఎంతో పారదర్శకంగా నిర్వహించే వంటశాలను తిరిగి గ్రామ సమాఖ్యల ద్వారా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని గ్రామ సమాఖ్యలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎస్‌హెచ్‌జీ భోజనం రూ.60నుంచి రూ.80కే
టీటీడీసీలో జిల్లా సమాఖ్యల ద్వారా నిర్వహించే వంటశాల భోజనాన్ని గతంలో రూ.60కే అందించారు. టీటీడీసీలో శిక్షణకు వచ్చిన విద్యార్థులకు అల్పాహారంతో పాటుగా భోజనాలను రోజంతా కలుపుకొని రూ.80కే అందించారు. మహిళా సంఘాల నిర్వహించే భోజనం ఇంటి భోజనం వలే ఉండటంతో టీటీడీసీలో విద్యార్థుల నుంచి పలు సమావేశాలకు హాజరైన కలెక్టర్లు, ఉన్నతాధికారులు సైతం మహిళా సంఘాల భోజనం భేష్ అని మెచ్చుకునే వారు. వీరితో పాటుగా ప్రైవేట్ కార్యక్రమాల సమావేశాలు నిర్వహించే వారు సైతం మహిళా సంఘాల భోజనాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు.
హోటళ్లలో రూ.100పై మాటే..
చిన్న కారణాలు, లోపాలను ఎత్తు చూసిన టీటీడీసీలోని పలు విభాగాల బాధ్యులు దశల వారీ గా శిక్షణా విద్యార్థులు సమావేశాలకు భోజనాలను ప్రైవేట్ హాటల్స్ నుంచి తెప్పించే వారు. దశల వారీగా భోజనాలు ప్రైవేట్ నుంచి తెప్పిస్తూ బిల్లులు మెక్కుతున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. ఒక్కో భోజనానికి సమావేశాన్ని అనుసరించి రూ.100నుంచి రూ.150వరకు బిల్లులు పెడ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై టీటీడీసీ పర్యవేక్షకురాలు శాయమ్మను వివరణ కోరగా కరోనా కారణంగా వంటశాలను మూసి వేశామన్నారు. ఇంకా ప్రారంభించలేదన్నారు.
