పల్లెలపై కరోనా పడగ

ABN , First Publish Date - 2021-05-21T04:31:47+05:30 IST

పల్లెలపై కరోనా పడగ

పల్లెలపై కరోనా పడగ

గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

పీహెచ్‌సీల పరిఽధిలో పరీక్షల సంఖ్య పెంపు

అదే స్థాయిలో అధికంగా నమోదవుతున్న బాధితులు 

ఖమ్మం, మే 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మొదటివేవ్‌లో కరోనా పట్టణాలకే పరిమితవగా.. పల్లెల్లో అక్కడక్కడా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కానీ సెకెండ్‌వేవ్‌ అందుకు భిన్నంగా ఉంది. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా నిత్యం భారీ సంఖ్యలో కరోనా బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ఈ నెలలో గురువారం వరకు ఖమ్మం జిల్లాలోని 34పీహెచ్‌సీల్లో ఆరు అర్బన్‌ కేంద్రాలు ఉన్నాయి. అన్నింటిలో కలిపి 29,844 పరీక్షలు చేయగా 10,446పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 29పీహెచ్‌సీల్లో 27,548టెస్టులు చేయగా.. 10,360 కరోనా కేసులు నిర్ధారణయ్యాయి. వీటిలో మూడువంతుల్లో ఒక వంతు కేసులు గ్రామాల్లో నమోదవడం పరిస్థితికి అద్దంపడుతోంది. అయితే మొన్నటి వరకు ప్రతి పీహెచ్‌సీలో 50మందికే పరీక్షలు చేయగా కరోనా వాప్తి ఉధృతి నేపథ్యంలో పరీక్షల సంఖ్యను పెంచాలని రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌ ఆదేశాలివ్వడంతో పరీక్షలను 100కు పెంచడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. అయితే స్వీయ నియంత్రణ, కరోనా కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్న కొన్ని గ్రామాలు మాత్రం ముప్పునకు దూరంగా ఉంటున్నాయి. 

వ్యాప్తికి ఎన్నో కారణాలు..

ఈ రెండో దశలో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఇంతలా పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి. నిత్యావసరాల కొనుగోలు, ఆసుపత్రుల్లో వైద్యంతో పాటు పలు అవసరాల నిమిత్తం గ్రామీణప్రజలు, చిరువ్యాపారులు నిత్యం ఖమ్మం నగరంతో పాటు తమకు సమీపంలోని పట్టణ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది కరోనాబారిన పడుతున్నారు. అయితే కరోనా వచ్చి ఆసుపత్రుల పాలైన వారికి సహాయంగా ఉండేందుకు వందల మంది గ్రామీణ ప్రజలు నగరంతో పాటు, పట్టణాల్లోని ఆసుపత్రులకు వచ్చి.. దగ్గరి బంధువులు, స్నేహితులు ఉన్నా ఈ పరిస్థితుల్లో ఎవరి ఇళ్లకు వెళ్లలేక.. ఆసుపత్రులు, పరిసరాల్లోనే తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో అలాంటివారిలో కూడా ఎంతో మంది కొవిడ్‌ బారిన పడుతున్నారు. అంతేకాదు శుభ, అశుభకార్యాలు కూడా కరోనా వ్యాప్తికి వేదికలవుతున్నాయి. అయినవారే కదా ఏమవుతుందిలే అన్న ధీమా, లక్షణాలు కనిపించని కొందరు వాహకాలుగా పనిచేయడం, కార్యక్రమాల సమయంలో సక్రమంగా రక్షణ చర్యలు తీసుకోకపోవడం లాంటివి, మామూలు రోజుల్లో లాగా గ్రామస్థులు ఒక చోట చేరి పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం, మాస్కులు ధరించకుండా సంచరిండం లాంటివి కరోనా వ్యాప్తికి మరింత దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన తండాల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కరోనా బారిన పడి ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. 

లాక్‌డౌన్‌ నిబంధనల అమల్లో అలసత్వం..

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినా.. అది కేవలం పట్టణాల్లో మాత్రమే పకడ్బందీగా అమలవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుభ, అశుభ కార్యక్రమాల నిర్వహణకు విధివిధానాలు ఉన్నా.. మారుమూల గ్రామాల్లో వాటిని పర్యవేక్షించే వారు కరువయ్యారని తెలుస్తోంది. స్థానికంగా సిబ్బంది ఉంటున్నా.. వారు కూడా ఆయా గ్రామాలకు చెందిన వారే ఉంటుండటం, స్థానికంగా రాజకీయ ప్రమేయం ఉంటుండంతో చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా గ్రామాల్లో లాక్‌డౌన్‌ అమలులో అలసత్వం ఏర్పడి కరోనా పడగ విప్పుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పెరుగుతున్న పాజిటివ్‌ రేటు

ఖమ్మం జిల్లాలో రెండురోజులుగా కరోనాపరీక్షల సంఖ్యను పెంచడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్యకూడా క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజుకు 1500పరిమితి ఉండగా.. 500 నుంచి 600వరకు పాజిటివ్‌లువచ్చాయి. ఇటీవల జరిగిన సమీక్షలో మంత్రి అజయ్‌కుమార్‌ ఆదేశాలతో అధికారులు టెస్టుల సంఖ్య పెంచారు. ఈక్రమంలో బుధవారం ఖమ్మం జిల్లాలో 2673పరీక్షలు నిర్వహించగా 849మందికి, గురువారం 2619మందికి పరీక్షించగా 784మందికి పాజిటివ్‌ వచ్చిది. 

ఈనెల ఇప్పటివరకు 29పీహెచ్‌సీల్లో ఇలా.. 

పీహెచ్‌సీ చేసిన పరీక్షలు పాజిటివ్‌

బనిగండ్లపాడు         833 219

బోదులబండ         994 347

బోనకల్‌ 1052 388 

చెన్నూరు 855 325 

చింతకాని 969 303 

దెందుకూరు         539 246 

ఏన్కూరు 959 349 

గంగారం 1,032 453 

కల్లూరు 887 253 

కామేపల్లి 1,128 537 

కొణిజర్ల          1,096 412 

కూసుమంచి         976 420 

లంకసాగర్‌         946 389 

మంచుకొండ         1,073 310 

మాటూరుపేట         501 257 

ముదిగొండ 882 305

ఎంవీపాలెం         986 257

నేలకొండపల్లి         936 329

పెద్దగోపతి 936 329 

సింగరేణి 1210 595 

సుబ్లేడ్‌ 893 245 

తల్లాడ 1080 437 

తిరుమలాయాలెం 928 272

వల్లభి         767 257 

వేంసూరు 967 355

వైరా         1,071 568 

మధిర 765 258

పెనుబల్లి 1241 342 

సత్తుపల్లి 1046 370


Updated Date - 2021-05-21T04:31:47+05:30 IST