మళ్లీ మొదటికి.. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-21T06:51:54+05:30 IST

‘కరోనా తగ్గింది. వ్యాక్సిన్‌ వచ్చింది.. ఇక భయపడాల్సిన పనిలేదు’ అనుకొని మాస్కు లేకుండా భౌతికదూరం పాటించకుండా, శానిటైజర్‌ వాడకుండా తిరిగేవారికి ఇదో హెచ్చరిక.. తగ్గుముఖం పట్టిందనుకుంటున్న కరోనా మహమ్మారి మళ్లీ జూలు విదుల్చుతోంది.

మళ్లీ మొదటికి.. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
11మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చిన ముదిగొండ మండలం పెద్దమండవ జడ్పీ ఉన్నత పాఠశాల

ఒకే రోజు 24 మందికి పాజిటివ్‌  

ఒకే పాఠశాలలో 11మంది విద్యార్థులకు 

రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న పోలీసులకూ పాజిటివ్‌

అప్రమత్తమైన జిల్లా వైద్యఆరోగ్యశాఖ

సూర్యాపేటలో ఆర్‌టీపీసీఆర్‌ కేంద్రానికి శ్యాంపిల్స్‌

ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ఖమ్మం సంక్షేమవిభాగం /కొత్తగూడెం కలెక్టరేట్‌: మార్చి 20: ‘కరోనా తగ్గింది. వ్యాక్సిన్‌ వచ్చింది.. ఇక భయపడాల్సిన పనిలేదు’ అనుకొని మాస్కు లేకుండా భౌతికదూరం పాటించకుండా, శానిటైజర్‌ వాడకుండా తిరిగేవారికి ఇదో హెచ్చరిక.. తగ్గుముఖం పట్టిందనుకుంటున్న కరోనా మహమ్మారి మళ్లీ జూలు విదుల్చుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కొవిడ్‌-19 వైరస్‌ ఇంకా కమ్యూనిటి స్ర్పెడ్‌ స్థాయిలోనే ఉందని ఖమ్మం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. గత పక్షం రోజులుగా జిల్లాలో ప్రతిరోజు రెండంకెల స్థాయిలో పాజిటటివ్‌ కేసులు నమోదవుతుండడంతో జిల్లాలో కరోనా మళ్లీ విజృంభిస్తొందనే సంకేతాలు వెలువడుతున్నాయి. 

వ్యాక్సిన్‌ తీసుకున్న పోలీసులకూ పాజిటివ్‌

ఖమ్మంఅర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఆరుగురికి పాజిటివ్‌ తేలడంతో కలకలం రేగింది. వీరితో పాటు రఘునాథపాలెం పోలీసుస్టేషన్‌లోనూ ఒక కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ వచ్చింది. మరికొన్న స్టేషన్లలోనూ కరోనా భయంతో ఎవరికివారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా ఆలయాల వద్ద విధులు నిర్వహించిన సందర్భంలోనే కరోనా సోకినట్టు భావిస్తున్నారు. అయితే పాజిటివ్‌ వచ్చిన ఆరుగురు పోలీసులూ కరోనా వ్యాక్సిన్‌ రెండుడోసులను తీసుకోవడం గమనార్హం. వ్యాక్సిన్‌ తీసుకున్నా వారు వైరస్‌ భారిన పడడం చర్చనీయాంశమైంది.   

పాజిటివ్‌ వచ్చిన వారికి మరో పరీక్ష

కరోనా నిర్ధారణకు ప్రస్తుతం జిల్లాలో ర్యాపిడ్‌, ట్రూనాట్‌ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా ర్యాపిడ్‌ పరీక్షలే చేస్తున్నారు. అయితే ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలతో ఖచ్చితమైన ఫలితం వస్తుంది. దాంతో జిల్లాలో పాజిటివ్‌ వచ్చినవారి శాంపిళ్లను మళ్లీ పరీక్షించేందుకు సూర్యపేటలోని ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షా కేంద్రానికి పంపుతున్నారు. ఇలా జిల్లాలో ప్రతిరోజు 75 మందికి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్యవిదాన పరిషత్‌ అధికారులు ఆదేశించారు. 

భద్రాద్రి జిల్లాలో కొత్తగా 8 పాజిటివ్‌ కేసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం కొత్తగా మరో 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 838 మందికి పరీక్షలు నిర్వహిస్తే 8 పాజిటివ్‌, 930 నెగెటివ్‌ నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగూడెం డివిజన్‌లో 4, భద్రాచలం డివిజన్‌లో 4 కేసులు నమోదయ్యాయి. ఈరోజు జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ లేదు.

ఒకే రోజు 24పైగా పాజిటివ్‌ కేసులు

గత పదిహేను రోజులుగా ఖమ్మం జిల్లాలో రోజుకు 4నుంచి 6వరకు కరోనా పాజి టివ్‌ కేసులు నమోదవుతుండగా మూడు రోజుల నుంచి ఈ సంఖ్య రోజుకు 10నుంచి 15వరకు పెరిగింది. శనివారం ఒక్కరోజే జిల్లాలో 24కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావటం వైరస్‌ తీవ్రతను తెలియజేస్తొంది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముదిగొండ మండలంలోని ముదిగొండ మండలం పెద్దమండవలోని జెడ్పీఉన్నత పాఠశాలో 11మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. పాఠశాలలో ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు 123మంది విద్యార్థులుండగా శనివారం 80మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరితోపాటు 10మంది ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులకు వైద్యసిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 11మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 8వతరగతిలో ఐదుగురికి, 7తరగతిలో నలుగురు, ఆరోతరగతిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో నలుగురు బాలికలు ఉండగా ఏడుగురు బాలురు ఉన్నారు. వారిని ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం 108వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్‌ వచ్చిన ఒక విద్యార్థి తల్లిదండ్రులకు కూడా వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో 11మంది విద్యార్థులకు పాజిటివ్‌ రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. ఇక బోనకల్లు మండలంలోని గరుకుల పాఠశాలలో  నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. దాంతో వారి శాంపిళ్లను ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు పంపించారు. ఇక చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. శనివారం జరిపిన పరీక్షలో ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైధ్యాదికారి డా అల్లాడి నాగేశ్వరరావు ధ్రువీకరించారు. ఇక జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లోనూ ఏడుగురికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది.  

అప్రమత్తంగా ఉండండి

డాక్టర్‌ మాలతి, ఖమ్మం డీఎంహెచ్‌వో 

జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజు 10నుంచి 15వరకు కేసులు వస్తున్నాయి. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. మాస్కు, శానిటైజర్‌ వినియోగిం చండి. భౌతికదూరం పాటించాలి. చాలామంది విద్యార్థులు మాస్కులు వినియోగించడం లేదు. అలాగే ఫంక్షన్లలో సభలు, సమావేశాల్లోనూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. నిర్లక్ష్యంగా వ్వహరిస్తే కరోనా బారినపడతారు. పాఠశాలల్లో భౌతికదూరంతో పాటు మాస్కులు, శానిటైజర్లు తప్పని సరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. వైరస్‌ వ్యాప్తిపై వైద్య విధాన పరిషత్‌ అప్రమత్తంగానే ఉంది. అవసరమన మేర పరీక్షలు నిర్వహిస్తున్నాం. 


Updated Date - 2021-03-21T06:51:54+05:30 IST