ప్రాణం గాలిలో దీపం

ABN , First Publish Date - 2021-05-22T05:14:04+05:30 IST

కొవిడ్‌తో జనం అల్లాడిపోతున్నారు. లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. జీవనోపాధికి కష్టంగా మారింది. చాలా మంది ఉపాధి లేక అప్పులు చేసి జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో మే, జూన్‌ నెలల్లో రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి రూ. రెండు వేల ఆర్థిక సహాయం, ఉచితంగా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ హామీ ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. రెండు నెలల నుంచి జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోయాయి ఈ దశలో సాయం చేస్తామని మాటిచ్చిన సర్కారు.. అమలులో మాట తప్పింది. గత లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం శూన్య ఖాతాలు ఉన్నవారికి, ఉపాధిహామీ కూలీలకు కొంత సాయం అందించింది. ఇప్పుడు అది కూడా లేదు.

ప్రాణం గాలిలో దీపం
గతేడాది పేదలకు ఇలా ఉచితంగా బియ్యం ఇచ్చారు

అటు అంక్షల లాక్‌డౌన్‌.. ఇటు కరోనా భయం

ఉపాధి లేక పేదలు, మధ్యతరగతి వాసుల విలవిల

కష్టకాలంలో అందని ప్రభుత్వాల సాయం

ఐసోలేషన్‌ కేంద్రాల్లో అంతంతమాత్రంగా సౌకర్యాలు

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను చేర్చుకోని వైనం

పరీక్షల నిర్వహణలోనూ ఇదే నిర్లక్ష్యం

అశ్వారావుపేట, మే 21: కొవిడ్‌తో జనం అల్లాడిపోతున్నారు. లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. జీవనోపాధికి కష్టంగా మారింది. చాలా మంది ఉపాధి లేక అప్పులు చేసి జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో మే, జూన్‌ నెలల్లో రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి రూ. రెండు వేల ఆర్థిక సహాయం, ఉచితంగా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ హామీ ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. రెండు నెలల నుంచి జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోయాయి ఈ దశలో సాయం చేస్తామని మాటిచ్చిన సర్కారు.. అమలులో మాట తప్పింది. గత లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం శూన్య ఖాతాలు ఉన్నవారికి, ఉపాధిహామీ కూలీలకు కొంత సాయం అందించింది. ఇప్పుడు అది కూడా లేదు.

వైద్యం అందడం లేదు

కొవిడ్‌ సమయంలో ప్రజలకు వైద్యచికిత్సలు అందించడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. జిల్లాలో అక్కడక్కడ కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, రోగులకు వైద్యచికిత్సలు చేస్తున్నారు. ఈ కేంద్రాలలో స్వల్ప లక్షణాలు ఉన్నవారు, కొంతమేర ఆక్సిజన్‌ అవసరమున్నవారికి మాత్రమే చికిత్సలు అందజేస్తున్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులను ఈ కేంద్రాలలో చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లమని చెబు తున్నారు. అక్కడ పడకలు ఖాళీ లేక పోవడం, విషమయంగా ఉన్న రోగులు ప్రైవేటు ఆసుపత్రుల వైపునకు చూడక తప్పడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు జేబులు ఖాళీ అవుతున్నాయి. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో పేద, మధ్య తరగతి రోగలు నరకం చూస్తున్నారు.

పరీక్షలు తగ్గించారు

కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజలను గాలిలో వదిలేసింది. సాయం లేదు. వైద్యం లేదు. వారం రోజులుగా వ్యాక్సిన్‌ లేదు. రోజువారీ కరోనా పరీక్షలను తగ్గించి, కేసులలో తిరోగమనం కన్పిస్తోందని చెబుతున్నారు. పరీక్షల కోసం వచ్చేవారిలో చాలా మందిని ఏదో కారణంతో వెనకకు పంపిస్తున్నారు. దీంతో పాజిటివిటీ శాతం పెరుగుతోంది. మొన్నటి వరకు పట్టణాలలో మాత్రమే కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ఇప్పుడు ఆ రికార్డును పల్లెలు దాటేస్తున్నాయి. ఇందుకు పరీక్షల లేమే ప్రధాన కారణంగా కన్పిస్తోంది. మరోవైపు పాజిటివ్‌ ఉన్నవారు కూడా ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరుగుతుండటంతో వ్యాధి వ్యాప్తి ఎక్కువవుతోంది. ఏ మండలంలో చూసినా కొవిడ్‌ మృతులు పెరిగిపోతున్నారు. ఇవన్నీ ఆందోళన కలిగిస్తున్న సంఘటనలే. ఈ పరిస్థితులను చూస్తున్న జనం కొవిడ్‌ వస్తే పరిస్థితి ఏమిటి? ప్రాణాలు ఉంటాయా? ప్రాణాలు దక్కినా వైద్యం కోసం రూ. లక్షలు ఖర్చయితే తరువాత కుటుంబం పరిస్థితి ఏమిటి? అనే సందేహాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Updated Date - 2021-05-22T05:14:04+05:30 IST