పేటపై ముప్పేట దాడి!

ABN , First Publish Date - 2021-05-21T05:22:52+05:30 IST

అశ్వారావుపేట...తెలంగాణ, ఆంరఽదా రాష్ట్రాల సరిహద్దున ఉన్న ప్రాంతం. ఇప్పుడు కొవిడ్‌తో వణికిపోతుంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి.

పేటపై ముప్పేట దాడి!
అశ్వారావుపేటలో రహదారిపై రద్దీ

రెండు నెలల్లో 1200లకుపైగా పాజిటివ్‌లు

నెలరోజుల్లోనే 40మందికి పైగా మృతి

కొందరి నిర్లక్ష్యం.. అందరి పాలిట శాపం

తగ్గని వేడుకలు..గణనీయంగా పెరుగుతున్న కేసులు

అశ్వారావుపేట రూరల్‌, మే 20: అశ్వారావుపేట...తెలంగాణ, ఆంరఽదా రాష్ట్రాల సరిహద్దున ఉన్న ప్రాంతం. ఇప్పుడు కొవిడ్‌తో వణికిపోతుంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అశ్వారావుపేట అంటే కరోనాకు పెట్టని కోటగా మారిందనే అభిప్రాయం అందరి నుంచి వినవస్తోంది. నిత్యం ఆంధ్రా ప్రాంతంతో సంబంధం కలిగి ఉండటం. అక్కడ కేసులు గణనీయంగా ఉండటం. ఈప్రాంతంలో జరిగే వేడుకలకు అక్కడ నుంచి జనం రావటం. ఇక్కడ కరోనా సోకినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బయట తిరగటం. నిబంధనలకు విరుద్ధంగా కొందరు వివిధ రకాల వేడుకలు నిర్వహిస్తుండటం వల్ల రోజూ దాదాపు యాభై వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

రెండు నెలల్లో 1200కుపైగా కేసులు

అశ్వారావుపేట మండలంలో మార్చి 20నుంచి కరోనా కేసులు సంఖ్య రావటం ఆరంభమైంది. అంతకు ముందు కేసులు ఒకటి రెండు ఉన్నా ఆతరువాత ఆసంఖ్య రెండంకెలకు చేరింది. ఆనాటి నుంచి ప్రతి రోజూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. అశ్వారావుపేట, వినాయకపురం గుమ్మడివల్లిలో ప్రతి రోజూ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ప్రతి రోజూ 50కి పైగానే పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. అపుడప్పుడూ మాత్రం 40లోపు వస్తుండగా ఎక్కువగా 50 వరకు వస్తున్నాయి. పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా ఉంటోంది. కొన్ని రోజులు అయితే పరీక్షలు చేయించుకున్న సగం మందికి కరోనా సోకుతోంది. ఇక కరోనా ఉధృతి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారమే 1200కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా రాజమండ్రి, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో పరీక్షలు చేయించుకుని చికిత్స పొందిన, పొందుతున్న వారు వందల్లోనే ఉన్నారు. ఇక కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్యలోనూ అశ్వారావుపేట ముందే ఉంది. ఇప్పటికే మండలంలో దాదాపు 40మందికిపైగానే మరణించారు. అశ్వారావుపేట 20మంది, ఊట్లపల్లిలో 3, ఉసిర్లగూడెంలో ముగ్గురు, నారంవారిగూడెంలో ఇద్దరు, వేదాంతపురంలో ఒకరు, ఆసుపాకలో ఒకరు, వినాయకపురంలో ఇద్దరు, గంగారంలో ఒకరు ఇలా మండల వ్యాప్తంగా 40మందికి పైగానే మృతిచెందారు. 

ఆ నాలుగు గంటలు రచ్చే...

కరోనా ప్రభలటానికి అనేక కారణాలు ఉంటున్నాయి. ఇందులో చెప్పటానికి ఇబ్బందిగా ఉన్నా ప్రజల నిర్లక్ష్యమే ఎక్కువ కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా ఉదయం 10గంటల నుంచి తిరిగి 6గంటల వరకు లాక్‌డౌన్‌ విధించింది. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు ప్రజలు రోడ్ల వెంట గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. పట్టణంలో దుకాణాల వద్ద జన రద్దీగా ఎక్కువగా కనిపిస్తోంది. రహదారులపై ఎపుడూ లేని విధంగా ట్రాఫిక్‌జాం ఏర్పడుతోంది. లాక్‌డౌన్‌ లేని ఆ నాలుగు గంటలు రచ్చ రచ్చగా ఉంటుంది. కొందరు మాస్క్‌లు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. దుకాణాల వద్ద భౌతికదూరం అనేది మచ్చకైనా కనిపించటం లేదు. అందరూ తొందర అంటూ దుకాణాల ముందు గుంపులుగా గుంపులుగా గుమిగూడుతున్నారు. దీంతో పాటు కొందరు కరోనా సోకినా నిత్యవసరాలు, కూరగాయలు అంటూ బయటకు వస్తున్నారు. మరికొందరు కరోనా సోకినా వారం రోజులు తరువాత బయట తిరుగుతున్నారు. కరోనా సోకిన వ్యక్తులు కనీసం 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. తరువాత మరోసారి పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ అని తేలితేనే బయటకు రావాలి. కాని అనేక మంది అవన్నీ గాలికొదిలేసి ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు. దీని వల్ల అనేకమందికి కరోనా సోకింది. పట్టణాలలో పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో వేడుకలు కరోనాకు వేదికగా మారుతున్నాయి. మారుమూల గ్రామాలైన నల్లబాడు, ఆసుపాక, అనంతారం, మామిళ్లవారిగూడెం, ఊట్లపల్లి, మామిళ్లవారిగూడెం వంటి గ్రామాల్లో 40కిపైగానే కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2021-05-21T05:22:52+05:30 IST