శ్రమదానంతో కాలువ నిర్మాణం
ABN , First Publish Date - 2021-05-20T05:45:08+05:30 IST
: అధికారులు వస్తారనో.. ఇక చేస్తారనో ఎదురు చూడటం వల్ల ఉపయోగం లేదనుకున్నారు. కాలువ నిర్మాణానికి గ్రామస్థులే స్వయంగా నడుం బిగించారు. బు

మణుగూరుటౌన్, మే 19: అధికారులు వస్తారనో.. ఇక చేస్తారనో ఎదురు చూడటం వల్ల ఉపయోగం లేదనుకున్నారు. కాలువ నిర్మాణానికి గ్రామస్థులే స్వయంగా నడుం బిగించారు. బుధవారం ఉదయం 6 గంటలకు డ్రైనేజీ పూడిక తీసే పనులను ప్రారంభించారు. పూడిక తీసిన కాలువకు వారు సమకూర్చిన సిమెంట్, రాయితో డ్రైన్‌కు సైడ్‌వాల్ నిర్మించారు. ఇది మణుగూరు మున్సిపాలిటీలోని రాజుపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు పలుమార్లు అధికారులకు, నాయకులకు తమ ప్రాంతంలో డ్రైనేజి వ్యవస్థను అభివృద్ధి చేయాలని, డ్రైన్‌లను నిర్మించాలని విన్నవించారు. ఎవరు పట్టించుకోకపోవడంతో తామే స్వయంగా కాలువ నిర్మించాలకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అనుకున్నదే తడవుగా కాలువ నిర్మాణం చేసినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. నిర్మాణ పనుల్లో స్థానిక న్యాయవాది సూర్యం ప్రముఖ పాత్ర వహించినట్లు తెలిపారు. తమ గ్రామంలో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని మార్చాలని ఏడీఈ జీవన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్థులు టి. రాజరత్నం, భూషణం, జాస్మిన్, అచ్చమ్మ, సుప్రియ, వేణు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.