పేలిన ప్రెషర్‌ బాంబ్‌

ABN , First Publish Date - 2021-12-16T04:36:36+05:30 IST

కూంబింగ్‌ బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి స్పెషల్‌ పార్టీకి చెందిన ఓ కానిస్టేబుల్‌ గాయపడిన సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బత్తినిపల్లి, ఎర్రంపాడు గ్రామాల సరిహద్దు అడవుల్లో బుధవారం ఉదయం జరిగింది.

పేలిన ప్రెషర్‌ బాంబ్‌
గాయపడిన కృష్ణప్రసాద్‌ను ఆసుపత్రి తరలిస్తున్న దృశ్యం

గాయపడిన స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ కృష్ణప్రసాద్‌

హైదరాబాద్‌ తరలింపు.. చర్ల అడవుల్లో ఘటన

చర్ల, డిసెంబరు 15 : కూంబింగ్‌ బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి స్పెషల్‌ పార్టీకి చెందిన ఓ కానిస్టేబుల్‌ గాయపడిన సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బత్తినిపల్లి, ఎర్రంపాడు గ్రామాల సరిహద్దు అడవుల్లో బుధవారం ఉదయం  జరిగింది. చర్ల మండలం చెన్నాపురంలో పోలీసులు నూతన పోలీస్‌ క్యాంపుని ఏర్పాటు చేస్తుండగా.. దాన్ని మావోయిస్టు పార్టీ  వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండడంతో పోలీసులు నిత్వం కూంబింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా చర్ల మండలం బత్తినిపల్లి, ఎర్రంపాడు, సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా, మావోయిస్టులు భూమిలో అమర్చిన ప్రెషర్‌బాంబ్‌ని కానిస్టేబుల్‌ కృష్ణ ప్రసాద్‌ తొక్కాడు. దాంతో ఆ బాంబ్‌ పేలి కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. కృష్ణ ప్రసాద్‌ది 2020 బ్యాచ్‌ కాగా,  అతడిది భద్రాద్రి జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలమని తెలుస్తోంది. ఘటన అనంతరం పోలీసులు గాలింపుని ముమ్మరం చేసినట్లు భద్రాద్రి ఎస్పీ కార్యాలయం నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. 

Updated Date - 2021-12-16T04:36:36+05:30 IST