భద్రాద్రి దేవస్థానం మాజీ చైర్మన్‌ కురిచేటి కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-24T06:32:32+05:30 IST

భద్రాచలం దేవ స్థానం పాలకమండలి మాజీ చైర్మన్‌ కురి చేటి పాండురంగారావు ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్‌లో కన్నుమూశారు.

భద్రాద్రి దేవస్థానం మాజీ చైర్మన్‌ కురిచేటి కన్నుమూత
కురిచేటి పాండురంగారావు (ఫైల్‌)

సంతాపం తెలిపిన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

భద్రాచలం, మే 23: భద్రాచలం దేవ స్థానం పాలకమండలి మాజీ చైర్మన్‌ కురి చేటి పాండురంగారావు ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. భద్రాచలంలోని చప్టాదిగువలో నివసిస్తున్న పాండురంగారావు దంపతులకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిం చారు. వైద్యసేవలు పొందిన తరువాత ఇద్దరూ కోలుకున్నారు. అయితే పాండురంగా రావు తిరిగి అస్వస్థతకు గురికావడంతో మళ్లీ వైద్యశాలలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందినట్టు ఆయన కుమారుడు కురిచేటి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మృతదేహానికి భద్రాచలంలో అంత్యక్రియలు నిర్వహించారు. పాండురంగారావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. భద్రాచలంలో ప్రముఖ వ్యాపారిగా ఉన్న ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా, భద్రాచలం డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో భద్రాచలం పంచాయతీ సర్పంచ్‌గా, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సభ్యుడిగా ఒక దఫా, మలివిడతలో 2010 నవంబరు 26నుంచి రెండేళ్లపాటు పాలక మండలి చైర్మన్‌గా ఆయన పని చేశారు.   

సంతాపం తెలిపిన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

కురిచేటి పాండురంగారావు మృతికి హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్ర్బాంతిని, సంతాపాన్ని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. కురిచేటి పాండురంగారావు మృతి తనకెంతో తీవ్ర బాధ కలిగించిందన్నారు. ఆయన మృతితో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు భావిస్తున్నామని దత్తాత్రేయ పేర్కొన్నారు. పాండురంగారావు మృతి పట్ల భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. పట్టణానికి చెందిన పలు రాజకీయపక్షాల నాయకులు, ఆర్యవైశ్య సంఘం, లయన్స్‌, రోటరీ, తదితర సంస్థల నాయకులు, ప్రతినిధులు, ఐటీసీకి చెందిన అధికారులు సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-05-24T06:32:32+05:30 IST