అధ్యయనోత్సవాలకు భద్రాద్రి ముస్తాబు

ABN , First Publish Date - 2021-12-31T05:47:25+05:30 IST

అధ్యయనోత్సవాలకు భద్రాద్రి ముస్తాబు

అధ్యయనోత్సవాలకు భద్రాద్రి ముస్తాబు
స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసిన దృశ్యం

రూ.60లక్షలతో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు 

మూడు నుంచి దశావతార అలంకారాలు 

భద్రాచలం, డిసెంబరు 30:దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు ముస్తాబవుతోంది. జనవరి 3వ తేదీ నుంచి 23వరకు జరిగే ఈ వేడుకల నేపధ్యంలో తొలి పది రోజులు పగల్‌పత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ  సందర్భంగా స్వామివారం ప్రతిరోజు ఒక ప్రత్యేక అలంకారంలో దర్శనమివ్వనున్నారు. 12న గోదావరిలో సీతారామచంద్రస్వామికి తెప్పోత్సవం, 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం నిర్వహిస్తారు. ఆ తర్వాత 13వ తేదీ నుంచి 23వరకు పది రోజుల పాటు రాపత్తు ఉత్సవాలను రాత్రి సమయంలో నిర్వహిస్తారు. ఈ సమయంలో స్వామివారు ప్రత్యేక అలంకారాల్లో వివిధ మండపాలకు వెళ్లనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. అధ్యయనోత్సవాల ప్రారంభానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. రూ.60లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా భద్రాద్రి రామాలయంలోని రాజగోపురంతో పాటు ఆలయ ప్రాకారాలకు రంగులను వేయగా చాందినీ వస్త్ర అలంకరణలో రామాలయం, పరిసరాలు సర్వాంగ సుందరంగా మారాయి. అలాగే అధ్యయనోత్సవ వేదిక అయిన మిథిలా స్టేడియంలో స్వామివారు ప్రతి రోజు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుండగా.. ఇందుకోసం వేదికను సిద్ధం చేస్తున్నారు. విద్యుద్ధీపాలకరణ తుది దశకు చేరుకోగా.. తెప్పో త్సవం నిర్వహించే గోదావరి తీరంలో ర్యాంపు నిర్మాణం ఇప్పటికే పూర్త యింది. హంసాలంకృత తెప్ప తయారీ పనులు కూడా శరవేగంగా సాగు తున్నాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో అధ్యయనోత్సవాల స్వాగతద్వారాలు ఏర్పాటు చేశారు.  13న వైకుంఠ ఏకాదశిని పురస్కరిం చుకొని నిర్వహించే ఉత్తరద్వార దర్శనానికి సెక్టార్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతుండగా.. బారికేడ్ల ఎత్తును గతంలో కంటే పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ముక్కోటి ఏర్పాట్లపై బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉత్సవాల వాల్‌పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. దేవస్థానం తరపున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులకు దేవస్థానం అధి కారులు ఆహ్వాన పత్రికలను అందజేసే ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-12-31T05:47:25+05:30 IST