రైతులూ అధైర్యపడొద్దు:భట్టి

ABN , First Publish Date - 2021-11-28T06:35:00+05:30 IST

రైతులూ అధైర్యపడొద్దు:భట్టి

రైతులూ అధైర్యపడొద్దు:భట్టి
తేమశాతాన్ని చూస్తున్న భట్టి విక్రమార్క

ధాన్యం కొనేవరకు కలిసికట్టుగా పోరాడుదాం

కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయి

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

ముదిగొండ మండలంలో వరిపొలాలు, 

ధాన్యం రాసుల పరిశీలన

ఖమ్మం, నవంబరు 27(ఆంధ్రజ్యోతిప్రతినిధి)/ముదిగొండ:  రైతులు పండించిన పంటలు నష్టానికి అమ్ముకొనేందుకు అధైర్యపడొద్దని, ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనుగోలు చేసేవరకు రైతులంతా ఏకతాటిపై కలిసికట్టుగా పోరాడదామని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో వరిపైర్లను, స్థానికంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ద్విచక్రవాహనంపై పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు భట్టి విక్రమార్కకు తమ గోడును వినిపించారు. కొనుగోళ్లపై స్పష్టత లేకపోవడంతో వరి కోయకుండా చేలోనే ఎండిపోతోందని, ఎవరైనా వరి కోసి ధాన్యం తీసుకెళ్లినా కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20రోజులుగా ఇంటివద్దే ధాన్యం ఉంటున్నా అధిక తేమశాతం ఉందని కొనుగోలు చేయడం లేదని  ఆరోపించారు. గోకినేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20రోజులవుతున్నా ఒక్క బస్తాధాన్యం కూడా కొనుగోలు చేయలేదని, దీంతో బస్తా(77కేజీలు) రూ.1,050కు దళారులకు అమ్ముకుంటున్నామన్నారు. అమ్మిన ధాన్యం సొమ్ము వెంటనే చెల్లించేందుకు దళారులు రూ.లక్షకు వెయ్యి కమీషన్‌ తీసుకుంటున్నారని రైతులు వాపోయారు.  

అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. దేశంలో వ్యవసాయ రంగం, రైతులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ఓ రకమైన కుట్ర జరుగుతోందని విమర్శించారు. రైతు పండించిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిన నైతిక బాధ్యత ఉందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ఢిల్లీకి వెళ్లి కూర్చొని ఇరుపార్టీలు బూటకపు ధర్నాలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి రైతులు రాసులుగా పోసుకొని కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా ఆలస్యం చేసి మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దళారులపాల్జేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతోందని, దుర్మార్గపు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వాపోయారు. రైతు పండించిన ధాన్యాన్ని కొనలేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిపోవాలని, తాము కొనుగోలు చేసి చూపిస్తామని సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కట్టిన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఒక ఎకరం కూడా సాగుకాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టుల కిందనే పంటలు సాగవుతున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌స్‌ నాయకులు గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్కనీరు కూడా పంటల సాగుకు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి ఏఈవో మౌనికను తేమశాతం చూడాలని కోరారు. 20రోజులు గడిచినా కేంద్రంలో ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. నేషనల్‌ హైవే కింద భూములు కోల్పోయిన రైతులు మిగిలిన భూమిని తమకు ధరణిలో కనిపించటం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు రైతులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్‌బాబు, సర్పంచ్‌ గుగులోతు క్రాంతి, ఎంపీటీసీ బిచ్చాల  భిక్షం, మల్లెల అజయ్‌, రమేష్‌, గుడిపూడి ఝాన్సీరాణి, బుచ్చిరామయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T06:35:00+05:30 IST