వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్న మోదీ, కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-12-30T06:30:18+05:30 IST

వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్న మోదీ, కేసీఆర్‌

వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్న మోదీ, కేసీఆర్‌
మీనవోలులో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీలో ప్రంసంగిస్తున్న భట్టి

నిరుద్యోగుల జీవితాలతోనూ చెలగాటమాడుతున్నారు

అర్హులైన వారందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి

కాంగ్రెస్‌ ఎర్రుపాలెం ప్లీనరీలో సీఎల్పీ నేత భట్టి 

ఎర్రుపాలెం, డిసెంబరు 29: సాగు రంగాన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు కావాలనే సంక్షోభంలోకి నెడతున్నారని, వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ధాన్యం కొనుగోళ్లు, పంటల సాగులో ఆంక్షలు విధిస్తున్నారని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ఆరోపించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో కాంగ్రెస్‌ ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకరరెడ్డి అధ్యక్షతన బుధవారంనిర్వహించిన కాంగ్రెస్‌ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. యాసంగి ధాన్యం చివరి గింజవరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా మెడలు వంచుతామని, రైతులు అధైర్యపడ వద్దన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఇకనైనా నోటిఫికేషన్లను జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పథకాలు తీసుకురావాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌రూ.2.30లక్షల కోట్లు దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. నాలుగేళ్ల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వకుండా విద్య, వైద్యం సక్రమంగా అందించకుండా వంతెలను నిర్మించకుండా, ఇస్తామని ప్రకటించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకుండా, రుణమాఫీ అమలు చేయకుండా,  పంట నష్టపరిహారం చెల్లించకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర రాబడిని కొల్లగొడుతోందని ఆరోపించారు. రైతుబంధు పేరిట ఎకరానికి రూ.5వేల ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తన చర్యలతో ఏటా రూ.50వేల వరకు నష్టం చేకూరుస్తోందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా అర్హులైన ప్రతీ ఒక్కరికి డుబల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సమరశంఖాన్ని పూరించడానికి ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో జనవరి9నుంచి పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులను వరిసాగు చేయవద్దని సీఎం కేసీఆర్‌ తన వ్యవసాయక్షేత్రంలో 150 ఎకరాల్లో వరి ఏవిధంగా సాగుచేస్తారని అన్నారు. వరి వేస్తే రైతులు ఉరి పెట్టుకోవాలన్న సీఎం కేసీఆర్‌ ఉరి వేసుకోవడానికి వరి సాగుచేశారా అని నిలదీశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని మాట తప్పిన కేసీఆర్‌ దళితుడికి ప్రతిపక్ష హోదా వస్తే కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అద్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వీరభద్రం, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

9నుంచి మధిర నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర 

ఖమ్మం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రైతులు ఎదుర్కొం టున్న సమస్యలు, పెరిగిన నిత్యావసరాల ధరలు, కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాల అమలుకాని హామీలపై నిరసన తెలపడంతో పాటు తాను ప్రాతి నిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జనవరి 9నుంచి మధిర నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం యడవల్లి నుంచి ప్రారంభం కానున్న ఆయన పాదయాత్ర చింతకాని మండలం మీదుగా మధిర, బోనకల్‌, ఎర్రుపాలెం మండ లాల్లో కొనసాగనుంది. తన పాదయాత్రలో గ్రామస్తులు, రైతులు, వ్యవసాయకూలీలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఆయావర్గాల వారిని కలిసి సమస్యలు తెలుసుకోనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో అమలు తీరు, పరిష్కారం కాని సమస్యలను ఈ పాదయాత్రలో ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తామరపురుగుతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని, డిమాండ్‌ చేయడంతోపాటు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, దళి తులకు మూడెకరాలు, ఆసరా పింఛన్లు, పథకాల అమల్లో నిర్లక్ష్యం, నిరు ద్యోగులు, వ్యవసాయకూలీల సమస్యలను పాదయాత్రలో ప్రస్తావించ నున్నారు. పాదయాత్రలో ప్రజలనుంచి విజ్ఞప్తులు స్వీకరించేలా కాంగ్రెస్‌ జిల్లా కమిటీ, మధిర నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు కార్యా చరణ సిద్ధం చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌ పార్టీని అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే సన్నద్ధంచేయబోతున్నారు. తన సొంత నియో జకవర్గంలో పాదయాత్ర అనంతరం ఇతర నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసే అవకాశం ఉంది. 

రైతులు, పేదల సమస్యల పరిష్కారానికి పాదయాత్ర 

భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత 

రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొం టున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలేదు. మిర్చిపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. అలాగే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఎక్కడా ఇవ్వడంలేదు. కొన్ని అసంపూర్తిగా వదిలే శారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు. గ్యాస్‌, పెట్రోల్‌  డీజి ల్‌ ధరలుపెరిగాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇలా ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతు న్నారు. ప్రజాసమస్యలనుప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు వాటిని పరిష్కరించేందుకు జనవరి 9 నుంచి పాదయాత్ర చేపడుతున్నా. 

Updated Date - 2021-12-30T06:30:18+05:30 IST