సంరంభం ఆరంభం

ABN , First Publish Date - 2021-10-07T06:08:38+05:30 IST

సంరంభం ఆరంభం

సంరంభం ఆరంభం
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న మంత్రి పువ్వాడ

ఇరుజిల్లాల్లో అట్టహాసంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు

ఖమ్మంలో పూజలు చేసి ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం కార్పొరేషన్‌, అక్టోబరు 6 : రాష్ట్ర పండుగైన బతుకమ్మ సంబురం.. ఉమ్మడి జిల్లాలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలిరోజున ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు కొలువుదీర్చి పూచించారు. ఖమ్మంలోని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం, ఇందిరానగర్‌ పర్ణశాల వద్ద బుధవారం రాత్రి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ఆయన వారితో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా  మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మ సంబురాలు ఎంతో ఉద్యమ స్ఫూర్తినిచ్చాయన్నారు. ఎమ్మెల్సీ కవిత సారథ్యంలోని జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించిందన్నారు. బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం నుంచి 13వ తేదీవరకు 9రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగినులు కార్యాలయాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఈ సంబురాల్లో మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారా, ఏఎంసీ, డీసీసీబీ, సుడా చైర్మన్లు లక్ష్మీప్రసన్న, కూరాకుల నాగభూషయ్య, బచ్చు విజయ్‌కుమార్‌, సీడబ్ల్యూసీ చైర్మన్‌ భారతిరాణి, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మహిళా కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సీపీ సతీమణి

ఖమ్మంక్రైం : ఖమ్మంలోని శ్రీకృష్ణప్రసాద్‌ మెమోరియల్‌ పోలీసు పాఠశాలలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఖమ్మం సీపీ సతీమణి, స్కూల్‌ చైర్‌పర్సన్‌ హృదయమీనన్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతకమ్మ అని, మహిళలు ఈ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు అనంతరం ఆమె బతుకమ్మను ఎత్తుకుని, పూజలు చేసి ఆడిపాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-10-07T06:08:38+05:30 IST