పామాయిల్ సాగుతో రైతుకు భరోసా
ABN , First Publish Date - 2021-10-29T06:40:36+05:30 IST
పామాయిల్ సాగు రైతులకు ఆర్థిక బరోసా కల్పిస్తోందని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వనపర్తి జిల్లాకు చెందిన రైతులు భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలోని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన పామాయిల్ వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు.

అంతరపంటలతో అదనపు ఆదాయం
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
క్షేత్ర పర్యటనకు వచ్చిన వనపర్తి జిల్లా రైతులు
సత్తుపల్లి/దమ్మపేట, అక్టోబరు 28: పామాయిల్ సాగు రైతులకు ఆర్థిక బరోసా కల్పిస్తోందని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వనపర్తి జిల్లాకు చెందిన రైతులు భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలోని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన పామాయిల్ వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. తుమ్మల ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారని తెలుసుకుని రైతులు అక్కడికి చేరుకుని ఆయనతో మాట్లాడి పామాయిల్ సాగు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల రైతులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్ధితుల్లో పామాయిల్ సాగు రైతులకు లాభదాయకంగా ఉందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 20లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారని, పామాయిల్ సాగు లాభాలను గుర్తించిన కేంద్రప్రభుత్వం కూడా ఈ పంటను ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటిస్తోందన్నారు. పామాయిల్ సాగు చేసే రైతులకు మంచి భవిష్యత్ ఉందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో అప్పారావుపేటలో ఆధునిక టెక్నాలజితో పామాయిల్ ప్యాక్టరీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దీంతో పామాయిల్‌కు ధర పెరగటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగు అధికంగా పెరిగిందన్నారు. పలు ఎత్తిపోతల పథకాలతో సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎడారి ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేస్తున్నారని, ఇందుకు అందరూ కేసీఆర్‌కు రుణపడి ఉండాలన్నారు. అదనపు ఆదాయంకోసం పామాయిల్‌లో అంతరపంటలుగా వక్క, మిరియం, తదిర పంటలు సాగు చేస్తున్నారని తుమ్మల వివరించారు. తాము కష్టాలతో పామాయిల్ సాగు ప్రారంభించామని, ఇప్పుడు అదేపంట రైతుల ఇంట సిరులు కురిపిస్తోందన్నారు.