వందపడకల ఆసుపత్రి నిరుపయోగం
ABN , First Publish Date - 2021-09-04T04:53:40+05:30 IST
మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో వైద్యసేవలు ప్రారంభిచాలని విపక్ష నేతలు చేస్తున్న ఆందోళనలు ఉధృత రూపం దాల్చుతున్నాయి.

సీజనల్ వ్యాధులతో ప్రజలు మృత్యువాతపడున్నారు
ఎమ్మెల్యే కాంతారావు మేనల్లుడి భార్య డెంగ్యూతో కన్నుమూసింది
వైద్యసేవలు ప్రారంభించి ఏజెన్సీ వాసులను కాపాడాలి
సీఎంవో కార్యదర్శి, వైద్యారోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల కమిషనర్లకు విపక్ష నేతల వినతి
మణుగూరు, సెప్ట్టెంబరు 3: మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో వైద్యసేవలు ప్రారంభిచాలని విపక్ష నేతలు చేస్తున్న ఆందోళనలు ఉధృత రూపం దాల్చుతున్నాయి. ఏజెన్సీ ఏరియాలో పోష్టికాహారం విషయాలపై పరిశీలనకు వచ్చిన సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్, స్త్రీశిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, వైద్యారోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణకు గురువారం విపక్ష నాయకులు అయోధ్య, వాసిరెడ్డి చలపతిరావు, మధుసూధన్‌రెడ్డి, పుల్లారెడ్డి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణుగూరులో వంద పడకల ఆసుపత్రి నిరుపయోగంగా ఉందని, ఏజెన్సీ ప్రాంత ప్రజలు సీజనల్ వ్యాఽధులతో మృత్యువాతపడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాంతారావు మేనల్లుడి భార్య డెంగ్యూతో మృతి చెందారని అధి కారులకు విపక్ష నాయకులు వివరించారు. ప్రమాదాలు జరిగి ఎవరైనా మృతి చెందితే శవపరీక్షల కోసం డివిజన్ ప్రజలు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలానికి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు వినతి మేరకు వాకాటి కరుణ స్పందిస్తూ త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య మణుగూరు ఆసుపత్రి విషయాన్ని ప్రత్యేకంగా సీఎంవో కార్యదర్శి స్మితాస బర్వాల్ దృష్టికి తీసుకెళ్తామని ఈసందర్భంగా వారికి హామీ ఇచ్చారు.