యారన్‌, పింజర్ల సబ్సిడీ చెల్లించాలి

ABN , First Publish Date - 2021-12-28T05:52:18+05:30 IST

బతుకమ్మ చీరలకు సంబంధించి 10 శాతం యారన్‌ సబ్సిడీతోపాటు ఆసాములకు రావాల్సిన పింజర్ల సబ్సిడీని చెల్లించాలని సీఐటీయూ తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ డిమాండ్‌ చేశారు.

యారన్‌, పింజర్ల సబ్సిడీ చెల్లించాలి
ధర్నా చేస్తున్న కార్మికులు

 సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 27: బతుకమ్మ చీరలకు సంబంధించి 10 శాతం యారన్‌ సబ్సిడీతోపాటు ఆసాములకు రావాల్సిన పింజర్ల సబ్సిడీని చెల్లించాలని సీఐటీయూ తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట సోమవారం సీఐటీయూ పవర్‌లూంవర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు, ఆసాములు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ పది శాతం యారన్‌ సబ్సిడీని మరమగ్గాల కార్మికులకు అందించడంలో చేనేత జౌళి శాఖ, టెస్కొ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. 2021 సంవత్సరం బతుకమ్మ  చీరల ఉత్పత్తి పూర్తయినా 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన సబ్సిడీని అందించడం లేదన్నారు. దీంతో కార్మికులు అందోళన చెందుతున్నారన్నారు. 2021 బతుకమ్మ చీరలకు సంబంధించి పింజర్ల డబ్బులను సబ్సిడీ రూపకంగా బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి కాగానే ఆసాములకు అందిస్తామని చేనేత జౌళి శాఖ కమిషనర్‌ హామీ ఇచ్చారన్నారు.  ఇప్పటికీ ఇవ్వడం లేదని, వెంటనే అ సబ్సిడీతోపాటు యారన్‌ సబ్సిడీని అందించాలని అన్నారు.  అనంతరం చేనేత జౌళి శాఖ ఏడీ సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, సీఐటీయూ నాయకులు మోర అజయ్‌, నక్క దేవదాస్‌, ఎనగంటి రాజమల్లు, గుండు రమేష్‌, గడ్డం ఎల్లయ్య, సబ్బని చంద్రకాంత్‌, ఆసాముల సమన్వయ కమిటీ నాయకులు రమేష్‌, అశోక్‌, రవి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-28T05:52:18+05:30 IST