విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2021-07-12T06:27:55+05:30 IST

జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆశించిన మేరకు వర్షాలు కురిశాయి.

విస్తారంగా వర్షాలు

- జగిత్యాల జిల్లా అంతటా వానలు

- 11 మండలాల్లో అత్యధికం

- ఒకే ఒక మండలంలో లోటు

- మూడు మండలాల్లో సాధారణం

- జోరుగా సాగు పనులు

జగిత్యాల, జూలై 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆశించిన మేరకు వర్షాలు కురిశాయి. జిల్లాలోని 11 మండలాల్లో సాధారణంగా కంటే అత్యధికంగా వర్షాలు కురిశాయి. మూడు మండలాల్లో సాధారణ స్థాయిలో వానలు పడ్డాయి. కేవలం ఒకే ఒక మండలంలో లోటు వర్షపాతం ఉంది. దీంతో నాట్ల కోసం జోరుగా వ్యవసాయ పనులను అన్నదాతలు నిర్వహిస్తున్నారు. జూన్‌ నెల ఆరంభంతో పాటు ఈనెలలో సైతం విస్తారంగా వర్షాలు కురవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరగుతుండడంతో పాటు బావులు, కాలువల కింద సాగు చేసుకుంటున్న రైతులు దుక్కులు దున్ని, నార్లు పోసి, నాట్లకోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో వరి నాట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. 

- 11 మండలాల్లో అధికంగా వర్షాలు..

జిల్లాలోని 11 మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. జిల్లాలోని రాయికల్‌, ధర్మపురి, సారంగపూర్‌, మల్యాల, కొడిమ్యాల, కోరుట్ల, మేడిపల్లి, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌, మల్లాపూర్‌ మండలాల్లో అధిక వర్షాలు కురిశాయి. జిల్లాలోని జగిత్యాల, పెగడపల్లి, వెల్గటూరు మండలాల్లో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదయింది. కేవలం జిల్లాలోని గొల్లపల్లి మండలంలో మాత్రమే లోటు వర్షపాతం నమోదు అయింది. కాగా జిల్లాలో నూతనంగా ఏర్పాటు అయిన జగిత్యాల రూరల్‌, బుగ్గారం, బీర్‌పూర్‌ మండలాల్లో వర్షపాతం వివరాలు నమోదు కావడం లేదు. 11 మండలాల్లో 20 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. మల్లాపూర్‌ మండలంలో సాధారణం కంటే 64 శాతం అధికంగా వర్షం కురిసింది. గొల్లపల్లి మండలంలో సాధారణం కంటే 22 శాతం తక్కువగా వర్షం కురిసింది. జిల్లాలో ఒక్క మండలం మినహా అన్ని మండలాల్లో కావల్సిన స్థాయిలో వర్షాలు కురవడం రైతుల్లో సంతోషాన్ని నింపాయి. 

- ఏ మండలంలో ఎంతెంత...?

జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో గత నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు 324.2 మి.మీ సాధారణ వర్షపాతం నమోదైంది. గత యేడాది ఇదే సమయానికి జిల్లాలో 237.9 మి.మీ వర్షం కురసింది. గత యేడాదితో పోలిస్తే ప్రస్తుత యేడాది 86.3 మి.మీ వర్షం అధికంగా కురిసింది. జగిత్యాల మండలంలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 341.4 మి.మీ, రాయికల్‌లో 357.2 మి.మీ, ధర్మపురిలో 311.4 మి.మీ, సారంగపూర్‌లో 294.0మి.మీ, మల్యాలలో 307.4మి.మీ, గొల్లపల్లిలో 219.4 మి.మీ, పెగడపల్లిలో 258.4 మి.మీ, కొడిమ్యాలలో 311.6 మి.మీ, వెల్గటూరులో 250.4మి.మీ, కోరుట్లలో 340.2 మి.మీ, మేడిపల్లిలో 379.6 మి.మీ, మెట్‌పల్లిలో 357.4మి.మీ, ఇబ్రహీంపట్నంలో 409.2 మి.మీ, కథలాపూర్‌లో 331.2 మి.మీ, మల్లాపూర్‌లో 393.6 మి.మీ వర్షపాతం రికార్డు అయింది. 

- చిన్న నీటి వనరులకు జలకళ..

జిల్లాలోని ఆయా గ్రామాల్లో గల చిన్న నీటి వనరులు జల కళను సంతరించుకుంటున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. భూ గర్భ జలాలు సైతం పెరుగుతున్నాయి. కాలువలు, పంట పొలాల్లో వర్షపు నీరు చేరుకుంటోంది. చెరువులు, కుంటల కింద సాగు చేస్తున్న రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా వరి నాట్లు వేసుకోవడంపై జిల్లా రైతాంగం దృష్టి సారించింది. పలు మండలాల్లో వరి నాట్లు వేయడం ప్రారంభమైంది. రానున్న రోజుల్లో వరినాట్లు జోరు అందుకోనున్నాయి. 

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రంలోని బాబ్లీ ప్రాజెక్టులను ఎత్తివేయడం వల్ల శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతోంది. జగిత్యాల జిల్లా రైతాంగం ఎస్సారెస్పీ నీటిపై ఆశలు పెంచుకుంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో వరద నీరు వస్తోంది.దీంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-07-12T06:27:55+05:30 IST