ప్రైవేట్ టీచర్స్‌కు ఆపత్కాల సహాయం ఏది?
ABN , First Publish Date - 2021-08-26T05:11:58+05:30 IST
కరోనాతో 17 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్‌ను పట్టించుకున్న దాఖాలాలు లేవని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.

- తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు
- మాజీ మంత్రి, బిజేపి నేత ఈటల రాజేందర్
జమ్మికుంట రూరల్, ఆగస్టు 25: కరోనాతో 17 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్‌ను పట్టించుకున్న దాఖాలాలు లేవని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ రెండు నెలలు మాత్రమే ఆపత్కాల సహాయం కింద నగదు, బియ్యం పంపిణీ చేశారన్నారు. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ తమ సమస్యలు చెప్పుకుందామని తన దగ్గరకు వచ్చారని, ప్రభుత్వానికి వారి గోడు వినిపిద్దామని కార్యక్రమం ఏర్పాటు చేశామని, వారిని బెదిరించారన్నారు. ఇంత నిర్భందంలో రాష్ట్ర ప్రజలు ఉండడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. ఉప ఎన్నికల ఊసే లేదని, హుజూరాబాద్‌లో గెలిచినంత మాత్రాన ప్రభుత్వం కూలిపోదని మంత్రి కేటీఆర్ వాఖ్యానించడం బాధాకరం అన్నారు. ఆలాంటప్పుడు గొర్ల మంద మీద తోడేళ్లు పడ్డట్లు ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గంపై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకులను ప్రలోభపెట్టి, ఖరీదు కట్టి చిల్లర పనులు చేసి కేసీఆర్ అభాసు పాలయ్యారన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు డిపాజిట్ కూడా రాదన్నారు. తనతో మాట్లాడిన ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారని, ఈ గడ్డ మీద వేరే పార్టీ ఉండొద్దని కొత్త చట్టం తీసుకు రావాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పేద బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పచ్చటి పల్లెల్లో చిచ్చు పెట్టవద్దని, తక్షణమే నికృష్ట చర్యలు ఆపాలన్నారు. ఇటీవల జరిగిన దళిత బంధు సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతున్న సమయంలో ఓ ఇద్దరు మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని, ఇంటిలిజెన్స్ అధికారులు ఆ మహిళలను గుర్తించి కేసీఆర్‌తో మాట్లాడించారన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఇతర ప్రజా ప్రతినిధులపై నమ్మకం లేక పోవడం వల్లే సామాన్య ప్రజలు, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులతో కేసిఆర్ మాట్లాడుతున్నారని తెలిపారు. సిద్దిపేట మంత్రి ఇక్కడ అడుగు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడి ప్రజలను ఎన్నికల తర్వాత ఎవరూ పట్టించుకోరని, ఈ విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌పై ఇక్కడి ప్రజలకు నమ్మకం లేదన్నారు. తన గెలుపు తర్వాత తెలంగాణలో పెను మార్పు వస్తుందన్నారు. ఎస్‌బీ అధికారి బాపురెడ్డి తన చొక్కా తానే చింపుకోని, బీజేపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఎనిమిది మందిపై కేసు పెట్టారన్నారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడ ఉండదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎరబెల్లి సంపత్‌రావు, జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉప ఎన్నిక తరువాత తెలంగాణకు శాశ్వత పరిష్కారం
వీణవంక: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక తరువాత తెలంగాణకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం మండలంలోని బేతిగల్, కనపర్తి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌లో పనిచేసే ఇంటెలిజన్స్ పోలీసులు ఈటల రాజేందర్‌కు మంచి మద్దతు ఉందని రిపోర్టులు ఇచ్చారన్నారు. బీజేపీ జెండా పడితే వారి ఇంటికి పోలీసులను పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని, కేసులు పెడుతున్నారన్నారు. కొంత మంది రాజేందరన్న ముఖంలో నవ్వు లేదని అంటున్నారని, 20 ఏళ్లు ఉద్యమ కారుడిగా, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశానని, అందరి గుండెల్లో చోటు సంపాదించుకున్నానని, ఇప్పుడు తన శరీరమంతా నిలువెల్ల గాయాల లాగా తయారైందన్నారు. రోజు పొద్దున పేపర్ చూస్తే బీజేపీ కార్యకర్తలను పోలీసులు బెదిరించినట్లు, ఇతర పార్టీలకు తీసుకెళినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఎవరు కూడా అధైర్యపడవద్దన్నారు. తన రాజీనామా వల్లనే దళితులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నానని, తన రాజీనామా వల్లనే కేసీఆర్ అంబేద్కర్‌కు పూలమాల వేయడంతో పాటు జై భీమ్ అని అన్నాడని గుర్తు చేశారు. అనంతరం ఇటీవల గ్రామాల్లో మృతి చెందిన కుటుంబసభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బొడిగే శోభ, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోరె స్వామి, నాయకులు సంపత్‌రావు, పెద్ది మల్లారెడ్డి, ఆలేటీ శ్రీనివాస్‌రెడ్డి, పల్లపురెడ్డి దేవేందర్‌రెడ్డి, స్వామి, రవియాదవ్, తిరుమల్, మహ్మద్ అఖిల్, రాపర్తి అఖిల్, కొండాల్‌రెడ్డి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.