కేటీఆర్‌ కోసం రంగంలోకి మాజీ ఎంపీ.. కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా!?

ABN , First Publish Date - 2021-01-21T05:23:16+05:30 IST

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ..

కేటీఆర్‌ కోసం రంగంలోకి మాజీ ఎంపీ.. కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా!?

క్రియాశీల రాజకీయాల్లోకి వినోద్‌కుమార్‌

వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం

అదే నియోజకవర్గంపై బండి సంజయ్‌ దృష్టి 

ఉమ్మడి జిల్లాలో ఆసక్తికర చర్చ


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ జిల్లాలో మరోసారి చర్చల్లోకి వస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో కేసీఆర్‌కు కుడిభుజంగా ఉంటూ వస్తూ రాష్ట్ర ఆవిర్భావానికి వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టడంలో వినోద్‌కుమార్‌ క్రియాశీలపాత్ర వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్‌ ఎంపీగా పనిచేస్తూ కేంద్రం నుంచి రాష్ర్టానికి రావలసిన నిధులను రాబట్టడంలో, ప్రయోజనాలను చేకూర్చే పథకాలను, పనులను మంజూరు చేయించడంలో తనదైన పాత్ర వహించారు. ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వినోద్‌కుమార్‌ అన్ని అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయనను మరింత క్రియాశీలం చేయాలనే యోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. 


మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్‌ ఆలోచన..

వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం వ్యవహారం త్వరలో కోర్టులో తేలిపోనున్నది. ఆయనకు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆయన స్థానంలో వినోద్‌కుమార్‌ను వేములవాడ నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం ప్రారంభమయింది. ఒకవేళ ఇప్పుడు కోర్టు తీర్పు రాకపోయినా వచ్చే ఎన్నికల నాటికైనా ఆయననే అభ్యర్థి చేయాలనే ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వినోద్‌కుమార్‌ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనను మంత్రివర్గంలో తీసుకొని.. రాబోయే రోజుల్లో కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే ఆయనకు అండగా ఉండేలా కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారని చెబుతున్నారు. 2014లో కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన వినోద్‌ కుమార్‌ పలు పనులను జిల్లాకు మంజూరు చేయించినా, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉంటూ స్మార్ట్‌ సిటీ సాధనకు కృషి చేసినా 2019లో పరాజయం పాలయ్యారు. ఆయన ఓటమికి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలే కారణమనే అభిప్రాయం కూడా అప్పట్లో టీఆర్‌ఎస్‌ నేతలు వ్యక్తం చేశారు.


కేసీఆర్‌ ఈ విషయాన్ని గుర్తించి వినోద్‌కుమార్‌ సేవలను పార్టీ కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవాలనే భావనతోనే అతి కీలకమైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఈ పదవిలో ఉన్న దానికంటే మంత్రిగా ఆయన మరింత క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్‌ మదిలో వేములవాడ అభ్యర్థిత్వాన్ని ఆయనకు కట్టబెట్టాలని ఉందని పార్టీ వర్గాల భోగట్టా. అందుకే వినోద్‌కుమార్‌ ఇటీవల కాలంలో వేములవాడ నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తున్నారని, కరీంనగర్‌, సిరిసిల్ల నియోజకవర్గాల పరిధిలో పలు కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా తన మూలాలను మరింత పటిష్టపరుచుకుంటున్నారని చెబుతున్నారు.


వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి జర్మనీలోనే ఉన్నారు. ఆయన ఈ సమయంలో అందుబాటులో ఉండకపోవడంతో నియోజకవర్గ ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోర్టులో అనుకోని పరిస్థితులు ఎదురైతే ఆయన స్థానంలో వినోద్‌ కుమార్‌ను నిలపాలన్నది పార్టీ యోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన రమేశ్‌బాబు స్థానాన్ని తిరిగి అదే సామాజికవర్గానికి ఇచ్చినట్లవుతుందని అందుకే వినోద్‌కుమార్‌ను తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు. రమేశ్‌ బాబు సామాజికవర్గం ఈ నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఉన్నందున ఆయన బంధువర్గంలో ఒకరైన వినోద్‌కుమార్‌ అభ్యర్థిగా మంచి పోటీ ఇస్తారని చెబుతున్నారు.  మరోవైపు ఇంకో రకమైన ఆసక్తి కలిగించే అంశం చర్చకు వస్తున్నది. 


పాత ప్రత్యర్థులే రంగంలో ఉంటారా

వినోద్‌కుమార్‌ను గత ఎన్నికల్లో ఓడించిన ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గతంలో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తి తామేనని చెప్పుకుంటున్న బీజేపీ అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామంటున్నది. బండి సంజయ్‌ కుమార్‌ కరీంనగర్‌లో మైనార్టీ ఓట్లు అధికంగా ఉండడంతో వేములవాడ నియోజకవర్గమే తనకు సురక్షితమైనదని భావిస్తున్నారని సమాచారం. దీంతో ఆయన ఈ నియోజకవర్గంపై దృష్టి సారించి ఇటీవలి కాలంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే వినోద్‌కుమార్‌, బండి సంజయ్‌ ఇక్కడా మళ్లీ ప్రత్యర్థులుగా రంగంలో ఉంటారనే చర్చ మొదలయింది.  


Updated Date - 2021-01-21T05:23:16+05:30 IST