రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
ABN , First Publish Date - 2021-01-12T06:02:33+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దివ్యక్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. కోరిన కోరికలు తీర్చే రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడెమొక్కు క్యూలైన్లు నిండిపోయాయి.

వేములవాడ, జనవరి 11 : వేములవాడ రాజరాజేశ్వరస్వామి దివ్యక్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. కోరిన కోరికలు తీర్చే రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడెమొక్కు క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారి నిత్య కల్యాణం, సత్యనారాయణవ్రతం పూజల్లో పాల్గొన్నారు. కొవిడ్-19 నిబంధనలు కొనసాగుతుండడంతో లఘుదర్శనం అమలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఘనంగా మహాలింగార్చన
రాజరాజేశ్వరస్వామివారికి సోమవారం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో 11 మంది ఋత్విజులు, వేదపండితులు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది వరకు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు స్వామివారి కల్యాణమండపంలో మహాలింగార్చన చేశారు. ఈ సందర్భంగా పిండితో చేసిన ప్రమిదలను లింగాకారంలో అమర్చి జ్యోతులు వెలిగించారు.