కరీంనగర్‌లో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-07T05:20:55+05:30 IST
ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది.

టీకా తీసుకున్న కలెక్టర్ శశాంక
సుభాష్‌నగర్, ఫిబ్రవరి 6: ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లాలో తొలిరోజు 1,139 మందికి వ్యాక్సినేషన్ చేయాలని నిర్ధేశించగా 574 మంది టీకా తీసుకు న్నారు. రెవెన్యూ ఉద్యోగులు 671 మందికిగాను 163, పోలీసు సిబ్బందికి 659 మందికిగాను 333, మున్సిపల్ సిబ్బంది 209 మందికిగాను 78 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో రెవెన్యూ ఉద్యోగులకు, పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో పోలీస్, జైలుశాఖ, అగ్నిమాపకశాఖ ఉద్యోగులకు, అంబేద్కర్ స్టేడియంలో మున్సిపల్ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేశారు. జిల్లా ఆస్పత్రిలో 47, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 144, అంబేద్కర్ స్టేడియంలో 76మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. హుజూరాబాద్‌లో 47, జమ్మికుంటలో 44, వీణవంకలో 35, శంకరపట్నంలో 38, సైదాపూర్‌లో 27, ఇల్లందకుంటలో 20, తిమ్మాపూర్ 27, రామడుగు 20, మానకొండూర్ 19, చొప్పదండి 15, గంగాధర 15 మందికి టీకా వేశారు. జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ కె శశాంక, అడిషనల్ కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, నర్సింహారెడ్డి, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి వ్యాక్సిన్ తీసుకున్నారు.