పాఠశాలలో అనధికారికంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌

ABN , First Publish Date - 2021-11-23T05:35:07+05:30 IST

జమ్మికుంట జిల్లా పరిషత్‌ బాయ్స్‌ హై స్కూల్‌లో అనధికారికంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటైంది. ఇది జరిగి నాలుగేళ్లయినా ప్రభుత్వానికి, విద్యాశాఖకు సమాచారం లేదు.

పాఠశాలలో అనధికారికంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌
స్కూల్‌ కాంప్లెక్స్‌ ఫోటో

- లెక్కకు రాని అద్దె డబ్బులు

- రెండు నెలల క్రితం ఆర్‌జేడీకి ఫిర్యాదు  

- ఇంకా విచారణ చేపట్టని అధికారులు

జమ్మికుంట, నవంబరు 22: జమ్మికుంట జిల్లా పరిషత్‌ బాయ్స్‌ హై స్కూల్‌లో అనధికారికంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటైంది. ఇది జరిగి నాలుగేళ్లయినా ప్రభుత్వానికి, విద్యాశాఖకు సమాచారం లేదు. ఈ కాంప్లెక్స్‌ అద్దె, ఇతరాల రూపంలో వచ్చిన ఆదాయం 6.91 లక్షల రూపాయలు లెక్కకు రాకుండా పోయాయి. ఇటీవల పట్టణానికి చెందిన కొందరు వరంగల్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 

పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ రోడ్డులో ఉన్న హై స్కూల్‌ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పాఠశాలను నాలుగేళ్ల క్రితం నూతన భవనంలోకి తరలించారు. అప్పటికి పాత భవనంలో రెండు షాపులు ఉన్నాయి. కూరగాయల మార్కెట్‌ రోడ్డును ఆనుకుని ఉన్న నాలుగు తరగతి గదులను షాపింగ్‌ కాంప్లెక్స్‌గా మార్చి ఆదాయం పొందాలని ఉపాధ్యాయులు అనుకున్నారు. నాలుగు తరగతి గదులకు షెట్టర్లు ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చారు. నాలుగేళ్లు గడిచినా ఆ అద్దె డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమకాలేదు. ఈ విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు సెప్టెంబరులో వరంగల్‌ ఆర్‌జేడీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆయన డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు విచారణ ప్రారంభం కాలేదు.


పాఠశాల పరిధిలో ఆరు షాపులు


హై స్కూల్‌ పరిధిలో మొత్తం ఆరు షాపులు ఉన్నాయి. వీటి ద్వారా నాలుగేళ్లలో 6.27 లక్షల అద్దె వచ్చింది. హై స్కూల్‌ ఆవరణలోని బోరులో నీళ్లు వాడుకున్నందుకు ట్యాంకర్ల యజమానుల నుంచి 60 వేల,  స్కూల్‌ ఆవరణలో గొర్లు మేపుకున్నందుకు  ఒక గొర్ల కాపరి నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేశారు.  మొత్తం 6.91 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ డబ్బులు ఇప్పటికీ ప్రభుత్వ ఖాతాలోకి చేరలేదు.


 అద్దె డబ్బులు పాఠశాల నిర్వహణకు వాడుతున్నాం

- సదానందం, ప్రధానోపాధ్యాయుడు 


పాఠశాల పరిధిలో మొత్తం ఆరు షాపులు ఉన్నాయి. వాటి ద్వారా వస్తున్న అద్దె డబ్బులను పాఠశాల నిర్వహణకు ఉపయోగిస్తున్నాం. హై స్కూల్‌ పరిధిలో ఆరు షాపులు ఉన్నట్లు విద్యా శాఖ లెక్కల్లో లేదు. అందుకోసమే ప్రభుత్వ ఖాతాలో వాటిని జమ చేయలేక పోయాం. షాపుల నిర్మాణం కోసం ఒక కౌన్సిలర్‌ కొంత డబ్బులు ఖర్చు చేశారు. సదరు కౌన్సిలర్‌ ఒక షాపును ఉపయోగించుకుంటున్నారు. నేను ఏ విచారణకు అయినా సిద్ధం. విద్యార్థుల కోసం అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు చేస్తాను. 


Updated Date - 2021-11-23T05:35:07+05:30 IST