టీఆర్‌ఎస్‌ గర్జనకు సన్నద్ధం కావాలి

ABN , First Publish Date - 2021-10-19T05:42:51+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితిలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 25న ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, నవంబరు 15న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ గర్జన మహాసభ నిర్వహిస్తున్న నేపఽథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి భారీ జన సమీకరణ దిశగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మార్గనిర్దేశం చేశారు.

టీఆర్‌ఎస్‌ గర్జనకు సన్నద్ధం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

- సిరిసిల్ల నియోజకవర్గంలో 153 బస్సుల ఏర్పాటు 

- 27న సన్నాహకంగా గులాబీ జెండాల ఆవిష్కరణ 

- టీఆర్‌ఎస్‌ నేతలకు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మార్గనిర్దేశం

సిరిసిల్ల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సమితిలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 25న ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, నవంబరు 15న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ గర్జన మహాసభ నిర్వహిస్తున్న నేపఽథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి భారీ జన సమీకరణ దిశగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మార్గనిర్దేశం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీ, తంగళ్లపల్లి ముస్తాబాద్‌, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులతోపాటు ముఖ్యమైన నాయకులతో సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 114 గ్రామాలు, మున్సిపాలిటీలోని 39 వార్డుల నుంచి గర్జన సభకు తరలించడానికి 153 బస్సులు సమకూర్చుకోవాలని సూచించారు. దాదాపు నెల రోజుల ముందు నుంచే సిద్ధమవుతున్న క్రమంలో ఈ నెల 27న సన్నాహాకంగా  మున్సిపల్‌ వార్డుల్లో గ్రామాల్లో గులాబీ జెండాలను ఎగురవేయాలని సూచించారు. మున్సిపల్‌ పరిధిలో ప్రతీ వార్డు నుంచి 50 మంది, గ్రామం నుంచి పెద్ద ఎత్తున సభకు తరలించడానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని,  పట్టణ, మండల శాఖల అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని అన్నారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య, టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, కల్వకుంట్ల గోపాల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, టీఆర్‌ఎస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మండలాల అధ్యక్షులు వరుస కృష్ణహరి, బొంపల్లి సురేందర్‌రావు, పాపగారి వెంకటస్వామి, గుజ్జుల రాజిరెడ్డి, గజభీంకార్‌ రాజన్న, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, జడ్పీటీసీలు చీటి లక్ష్మణ్‌రావు, పూర్మాణి మంజుల, కొమిరిశెట్టి విజయ, గుగులోతు కళావతి, గుండం నర్సయ్య, ఎంపీపీలు జనగామ శరత్‌రావు, పడిగెల మానస, వంగ కరుణ, మాలోతు బూల, పిల్లి రేణుక, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్‌కు  మద్దతుగా మహిళా విభాగం నుంచి నామినేషన్‌ దాఖలు 

టీఅర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరపున నామినేషన్‌ సెట్‌ను మహిళా విభాగం ప్రజాప్రతినిధులు సోమవారం అందజేశారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్‌ సునీతతోపాటు సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, తంగళ్లపల్లి, గంభీరావుపేట ఎంపీపీలు పడిగెల మానస, వంగ కరుణ గంభీరావుపేట జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాలవ్వ, ముస్తాబాద్‌ కమిటీ చైర్మన్‌ జనాబాయి, ఇతర మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:42:51+05:30 IST