హుజూరాబాద్ ఎన్నికల ఇన్చార్జ్లు, సమన్వయకర్తలతో రేవంత్ భేటీ
ABN , First Publish Date - 2021-10-21T19:32:19+05:30 IST
హుజురాబాద్ ఎన్నికల ఇన్చార్జ్లు, సమన్వయకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు.

కరీంనగర్: హుజురాబాద్ ఎన్నికల ఇన్చార్జ్లు, సమన్వయకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. హుజురాబాద్ ఎన్నికలలో ఇంటికో ఓటు కాంగ్రెస్కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేతలకు రేవంత్ తెలిపారు. నిరుద్యోగ యువత, విద్యార్థులను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలన్నారు. వచ్చే వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలను నాయకులతో రేవంత్ చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడికి, విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకెళ్లాలన్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలి... బీజేపీ, టీఆర్ఎస్ల మోసపూరిత విధానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, చేసిన నష్టాలను వివరించాలని నేతలకు తెలిపారు.
ఈ ఉప ఎన్నికలకు కారణం ఏమిటి.. ఎవరు.. దళిత బంధును అడ్డుకున్నదేవరు... ఇచ్చిన మాటలు అమలు చేయకుండా ప్రజలను వంచించింది ఎవరు అనేది ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని సూచనలు చేశారు. బీజేపీ, టిఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలను.... చీకటి రాజకీయాలను బయటపెట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండేలా ప్రచార వ్యూహాలను అమలు చేయాలని నేతలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ చెప్పారు. జూమ్ మీటింగ్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.