నేడు, రేపు సద్దుల బతుకమ్మ
ABN , First Publish Date - 2021-10-13T04:47:46+05:30 IST
ఎంగిలిపూల బతుకమ్మ నుంచి చూస్తే తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కొందరు బుధవారం, మరి కొందరు గురువారం పండుగ జరుపుకోనున్నారు. ఈయేడు 13, 14 తేదీల్లో రెండు రోజులు సద్దుల బతుకమ్మ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కరీంనగర్ కల్చరల్ అక్టోబరు 12: ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలతో మొదలయ్యే బతుకమ్మ ఉత్సవాలు సద్దులతో ముగుస్తాయి. గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీ దేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను నిల్పి ముస్తాబు చేసిన బతుకమ్మ చుట్టూ మహిళలు, ఆడ పిల్లలు ఆడుతారు. అనంతరం మహిళలు నీళ్లలో బతుకమ్మలను నిమజ్జనం చేసి పసుపు గౌరిని అలంకరించుకొని పరస్పరం వాయినాలు పంచుకుంటారు. గోధుమలు, పెసళ్ళు, బియ్యం, మినుములు, తదితర ధాన్యాలతో తయారు చేసిన సత్తు (పిండి వంటలను) ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి చూస్తే తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కొందరు బుధవారం, మరి కొందరు గురువారం పండుగ జరుపుకోనున్నారు. ఈయేడు 13, 14 తేదీల్లో రెండు రోజులు సద్దుల బతుకమ్మ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మార్కెట్‌లో సందడి...
సద్దుల బతుకమ్మ సందర్భంగా మార్కెట్‌లో మంగళవారం సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు విరివిగా పలు రకాల పూలను తీసుకువచ్చి అమ్మకానికి ఉంచారు. ఈ పండుగలో కీలక పాత్ర పోషించే గుమ్మడి, గులాబి, గోరెంట, కట్ల, కనకాంబరాలు, గునుగు, తంగెడు, సీతజడలు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి, పోకబంతి, అల్లి, లిల్లి, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు లాంటి పూల కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి కనబరిచారు.