నేడు క్రిస్మస్‌

ABN , First Publish Date - 2021-12-25T05:37:41+05:30 IST

క్రిస్మస్‌ అంటే ఆనందం... సంతోషం.. ఏసుక్రీస్తు జన్మించిన రోజును క్రిస్మస్‌గా జరుపుకుంటారు.

నేడు క్రిస్మస్‌
లూర్దు మాతా చర్చిలో ప్రార్థనలు చేయిస్తున్న ఫాదర్‌ టి థామస్‌, ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు

 చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబరు 24: క్రిస్మస్‌ అంటే ఆనందం... సంతోషం..  ఏసుక్రీస్తు జన్మించిన రోజును క్రిస్మస్‌గా జరుపుకుంటారు. ఏటా డిసెంబరు 25వ తేదీన వచ్చే ఈ పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు ఉత్సవాలు జరుపుకుంటారు. బెత్లెహం పట్టణంలో మేరి మాతకు జన్మించిన శిశువైన ఏసుక్రీస్తు కారణంగా ఏర్పడిన క్రైస్తవ మతం ప్రపంచమంతా వ్యాపించింది. క్రిస్మస్‌ రోజు చర్చిల్లో ప్రార్థనలు, ప్రార్థనా గీతాలాపనలు అతి ప్రధానాంశాలు. కేక్‌, స్వీట్లు స్నేహితులకు, బంధువులకు పంచుతారు.


 చర్చిల్లో ప్రత్యేక ఏర్పాట్లు


10 రోజుల ముందు నుంచే జిల్లా కేంద్రంలోని చర్చిలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు, ప్రసంగాలకు వీలుగా ఆయా చర్చిల యజమాన్యాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.  కెథడ్రిల్‌ వెస్లి చర్చి, సెయింట్‌ మార్చ్‌ చర్చి, సెంటినరీ చర్చి, లూర్దూ మాతా, బేతేలు ప్రార్థనా మందిరాల్లో ముఖ్య ప్రార్థనలు, క్రిస్మస్‌ వేడుకలు జరగనున్నాయి. నగర శివారులో, పలు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో నెలకొన్న చర్చిల్లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు జరుపుకునేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. 


 లూర్దుమాతా చర్చ్‌లో బాలఏసు జన్మదిన వేడుకలు


జిల్లా కేంద్రంలోని లూర్దు మాతా చర్చ్‌లో రోమన్‌ కాథిలిక్స్‌ ఆధ్వర్యంలో బాలఏసు జన్మదిన వేడుకలను శుక్రవారం అర్ధరాత్రి వేళ ఘనంగా జరిపారు. ఫాదర్‌ టి థామస్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సందేశాన్నిచ్చారు. ఆవరణ క్రీస్తు జనన విశేషాలు, పశువుల పాక సన్నివేశం, మేరిమాత గుహ వంటి దృశ్యాలతో శోభాయమానంగా కనిపించింది. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్వాయర్స్‌ బృందం ఆధ్వర్యంలో గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చర్చి కమిటీ అధ్యక్షకార్యదర్శులు అంబటి రాజిరెడ్డి, గాలి రాజిరెడ్డి, సభ్యులు కోటేశ్వర్‌రావు, బాల్‌రెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T05:37:41+05:30 IST