ముంచుకొస్తున్న కరోనా ముప్పు

ABN , First Publish Date - 2021-11-29T05:28:03+05:30 IST

కరోనా మహామ్మారి మరో రూపంలో ప్రభావం చూపుతున్నది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ రూపాంతరంతో కరోనా ఆ దేశంలో విరుచుకుపడుతోంది.

ముంచుకొస్తున్న కరోనా ముప్పు

- ఒమిక్రాన్‌ రూపంలో విజృంభణ 

- అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ

- వ్యాక్సిన్‌ తీసుకోని వారికి అధిక ముప్పు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా మహామ్మారి మరో రూపంలో ప్రభావం చూపుతున్నది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ రూపాంతరంతో కరోనా ఆ దేశంలో విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్‌ కంటే అత్యంత వేగంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలకు సోకుతూ పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల పాలు చేస్తున్నది. ఆయా దేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌లో ఉంచి వ్యాధివ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను జారీ చేసింది. ఇప్పటికీ ఈ కొత్త వేరియంట్‌ రాష్ట్రంలో అడుగుపెట్టకున్నా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా అప్రమత్తమై అన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నది. బెంగుళూరు, ముంబాయి ఏయిర్‌పోర్టుల ద్వారా దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు దేశంలో రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం ఉన్నందున అలాంటి ప్రయాణికులపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి సారిస్తున్నది. బెంగుళూరులో ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలించి వారి రక్తనమూనాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ అవునో కాదో తెల్చే పరీక్షల కోసం పంపించారు. బెంగుళూరు, ముంబాయిలకు జిల్లా నుంచి నేరుగా బస్సు సౌకర్యాలు ఉండడం, రైలు ప్రయాణానికి కూడా అవకాశాలుండడంతో కరీంనగర్‌కు కూడా ఆయా రాష్ట్రాల్లో కొత్త వేరియంట్లు సోకితే ప్రమాదం వాటిల్లే అవకాశం లేక పోలేదు. 


 ఫస్ట్‌ వేవ్‌లో ఇండోనేషియన్ల ద్వారా జిల్లాలో వ్యాప్తి


గతంలో  ముంబాయి నుంచి వచ్చిన ఇండోనేషియన్ల ద్వారా ఇక్కడ కరోనా తొలికేసులు నమోదై ఆ తర్వాత వేలాది మంది వ్యాధి బారినపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్‌ డెల్టా వేరియంట్‌ కంటే ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా దీని ప్రమాదాన్ని కొంత అరికట్టవచ్చు. పండుగలు, వివాహాల నేపథ్యంలో రాష్ట్రంలో, జిల్లాలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలకు పూర్తిగా తిలోదకాలిచ్చారు. అసలు ఆ వ్యాధి ఉనికినే గుర్తించకుండా ఎవరు కూడా భౌతిక దూరాన్ని పాటించడం లేదు. 50 శాతం మందికిపైగా మాస్క్‌లు ధరించడం లేదు. మరోసారి వైరస్‌ విజృంభిస్తే జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. 


 ముందు జాగ్రత్తలు తప్పనిసరి


ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడం కోసం ప్రజలు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి ప్రజలకు సూచించారు. జిల్లాలో 11,19,947 మంది జనాభా ఉండగా 18 సంవత్సరాలు నిండి వ్యాక్సినేషన్‌ పొందడానికి అర్హులైన వారు 7,92,923 మందిగా గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు 7,47,499 మంది మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పొందారు. జిల్లాలో 94.27 శాతం మొదటి డోసు పొందగా మరో 45,424 మంది ఇంకా వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 5,45,863 మంది రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 2,01,636 మంది తీసుకోవలసి ఉన్నది. మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకొని రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి గడువు మీరినవారు 43,346 మంది ఉన్నారు.  ఇప్పటికీ మొదటి, రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోనివారు వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే ఒమిక్రాన్‌ రూపాంతరం వ్యాపించిన పక్షంలో తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా కరోనా సోకే ప్రమాదమున్నా.. అది తీవ్ర అనారోగ్య పరిస్థితులకు ప్రాణహానికి దారితీయక పోవచ్చని, అసలే వ్యాక్సిన్‌ తీసుకోని వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవడంతోపాటు మాస్క్‌లు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, వీలైనంతవరకు సమూహాలుగా ఏర్పడకుండా ఉంటే కొత్త వేరియంట్‌ కరోనాను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పౌరుల ముందు జాగ్రత్త చర్యలే వారి ప్రాణాలకు రక్షగా మారిన ఈ పరిస్థితులను గమనించి నడుచుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిస్తున్నది. 


Updated Date - 2021-11-29T05:28:03+05:30 IST