ప్రజలు బాగుపడాలా.. ఈటల బాగుపడాలా.. ఆలోచించండి

ABN , First Publish Date - 2021-08-27T06:28:12+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ఈటల బాగుపడాలా... ప్రజలు బాగుపడాలా ఆలోచించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

ప్రజలు బాగుపడాలా.. ఈటల బాగుపడాలా.. ఆలోచించండి
వీణవంక మండలం దేశాయిపల్లిలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

- బీజేపీ గెలిస్తే విద్యుత్‌ మీటర్లు పెడుదామంటుంది

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

వీణవంక, ఆగస్టు 26: హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ఈటల బాగుపడాలా... ప్రజలు బాగుపడాలా ఆలోచించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం వీణవంక మండలం దేశాయిపల్లిలో టీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ హుజూరాబాద్‌ ప్రజలను ఏం చెప్పి ఓట్లు అడుగుతుందన్నారు. హుజూరాబాద్‌కు ఏం చేసిందన్నారు. బీజేపీ గెలిస్తే వ్యవసాయ బావుల వద్ద విద్యుత్‌ మీటర్లు పెడుతామంటుంది. ఉచిత విద్యుత్‌ ఇస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటు వేద్దామా, విద్యుత్‌ మీటర్లు పెడుతున్న బీజేపీ ఓటు వేద్దామా ప్రజలు ఆలోచించాలన్నారు.  బీజేపీ అమ్మకానికి.. టీఆర్‌ఎస్‌ నమ్మకానికి మరో రూపమన్నారు. ఈటల అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, బీజేపీ రాష్ట్ర నేతలంతా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకుంటలేరా, టీఆర్‌ఎస్‌ నాయకులంతా హుజూరాబాద్‌కు వచ్చి ప్రచారం చేస్తున్నారని ఈటల అనడం సరికాదని, పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా ప్రచారం చేయవచ్చని ఆయన అన్నారు. కాళేశ్వరం పూర్తవుతదా అన్నారు.. ఆరేళ్లలో పూర్తి చేసి రైతులకు నీళ్లందించిన ఘనత కేసీఆర్‌దన్నారు. రైతులకు ఏ కష్టం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. వీణవంకలో రెండు మూడు రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్‌గ్రేడ్‌ చేసి 24 గంటలు పనిచేసేలా పోస్టుమార్టం కేంద్రంతో పాటు మార్చురీ గది, ఫ్రీజర్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ కూడా రాలేదని ఆయన అన్నారు. ఆనాడు ప్రజల కోసం కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఈటల రాజేందర్‌ ఎందుకు రాజీనామా చేశారో ప్రజలు చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తే ప్రజలు బాగుపడుతారని, బీజేపీ గెలిస్తే ఈటల బాగుపడతాడని, ప్రజలు బాగుపడాల, ఈటల బాగుపడాల ప్రజలే ఆలోచించాలన్నారు. ఈటల గడియారాలు, కుట్టు మిషన్లు, కుంకుమ భరిణలను నమ్ముకుంటే టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధినే నమ్ముకుందని, ఏడేళ్లుగా ఈటల మంత్రిగా ఉండి చేయని అభివృద్ధి, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి చేస్తాడో ఆలోచించాలన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గడపగడపకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ నేతలు ఇక్కడ పాదయాత్రలు, తీర్థయాత్రలు కాకుండా ఢిల్లీ యాత్ర చేసి హుజూరాబాద్‌కు వెయ్యి కోట్లు తీసుకురావాలన్నారు. గెల్లు శ్రీనును గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామన్నారు. హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌కు అడ్డా అని, ఈటల రాకముందు ఈ గడ్డపై గులాబీ జెండా ఎగిరిందని, ఈటల వెళ్లాక కూడా గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు. కరీంనగర్‌ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ రామకృష్ణాపూర్‌ గ్రామాన్ని దత్తకు తీసుకొని రెండున్నర ఏళ్లు గడిచిన రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి గెల్లు శ్రీనివాస్‌కు భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ పేదింటి బిడ్డనైనా తాను నిబద్ధతో పని చేశానని, ఎన్ని కష్టాలు వచ్చిన ఉద్యమ బాట వీడలేదని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వెనుకడుగు వేయకుండా ఉద్యమంలో పాల్గొన్నానన్నారు. తకు ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానని, తనను గెలిపిస్తే కష్టాల్లో తోడు ఉంటానని,  ఆశీర్వాదించాలని కోరారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ రాయిశెట్టి లత శ్రీనివాస్‌ తన అనుచరులతో బీజేపీ నుంచి మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-08-27T06:28:12+05:30 IST