ఆలయ పాలన అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2021-02-01T06:08:11+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది.

ఆలయ పాలన అస్తవ్యస్తం
శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం

-‘రాజన్న’ భక్తుల భద్రత గాలికి..

-కనీస సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం

-పూర్తి స్థాయి ఈవో లేక తప్పని ఇబ్బందులు

-నేడు వేములవాడలో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

వేములవాడ, జనవరి 31: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. కొంతకాలంగా పూర్తి స్థాయి కార్యనిర్వహణాధికారిని నియమించకుండా హైదరాబాద్‌లో ఇతర హోదాలో ఉన్న వారికి రాజన్న ఆలయ ఈవోగా అదనపు భాద్యతలు అప్పగించారు. దీంతో భక్తుల సౌకర్యాల విషయంలో పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. దేవస్థానం అభివృద్ధి విషయంలో ఐదేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తున్నారు. డిజైన్లు, గ్రాఫిక్స్‌తో కాలం గడుపుతున్న ప్రభుత్వం చివరకు భక్తులకు వసతి, దర్శన సౌకర్యం వంటి అంశాలను కూడా విస్మరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

 వసతి లభించడం గగనమే..


స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు కనీస వసతి లభించకపోవడంతో వారు ప్రైవేటు అద్దె గదులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆలయానికి సంబంధించి సుమారు 500 వసతి గదులు ఉండగా, ఇందులో పార్వతీపురం, నందీశ్వర కాంప్లెక్స్‌, అమ్మవారి కాంప్లెక్స్‌ సముదాయాలలో మాత్రమే గదులు అద్దెకు ఇస్తున్నారు. లక్ష్మీగణపతి కాంప్లెక్స్‌లో కొవిడ్‌-19 ఐసోలేషన్‌ కేంద్రం ఇంకా కొనసాగుతుండడంతో అందులోని గదులు భక్తులకు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రాజేశ్వరపురం గదులు కూడా అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో ఇంత పెద్ద దేవాలయంలో దాదాపు రెండు వందల గదులు మాత్రమే భక్తులకు ఇస్తున్నారు. భీమేశ్వర సదన్‌ నిర్మాణం పూర్తయినా ఫర్నీచర్‌ కొనుగోలులో ఆలస్యం కారణంగా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. 

 దర్శనానికి తప్పని తిప్పలు..


రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం భక్తులు నానా తిప్పలు పడుతున్నారు. క్యూలైన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం, రెండు, మూడు మార్గాలలో ఆలయం లోపలికి వెళుతూ ఒకే మార్గంలో బయటకు వచ్చే పరిస్థితి ఉండడంతో తోపులాట, గందరగోళం మధ్య దర్శనం కోసం వచ్చిన భక్తులకు స్వామివారిని దర్శించుకున్న సంతృప్తి మిగలడం లేదు. దీనికి తోడు కొవిడ్‌-19 నిబంధనల పేరిట అభిషేకం, అన్నపూజ, కుంకుమపూజ వంటి ఆర్జిత సేవలు ప్రారంభించకపోవడం పట్ల భక్తులు, దార్మిక సంస్థల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోడెమొక్కుల చెల్లింపు కోసం భక్తులకు గంటల కొద్దీ క్యూలైన్లలో వేచిచూడాల్సి వస్తుండగా, క్యూలైన్లలో తాగునీటి వసతి, టాయిలెట్లు సరిపోయినన్ని లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. క్యూలైన్‌లోకి ప్రవేశించిన భక్తులు మొక్కు చెల్లించుకోవడానికి ఎన్ని గంటలు పడుతుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. 

 భక్తుల రక్షణను పట్టించుకోని యంత్రాంగం..


కొవిడ్‌-19 మహమ్మారితో చరిత్రలో తొలిసారిగా కొన్ని నెలల పాటు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించిన నేపథ్యంలో తిరిగి దర్శనాలు ప్రారంభమైన అనంతరం భక్తుల రక్షణపై ఆలయ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పునఃప్రారంభం అనంతరం ప్రతినిత్యం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించగా, క్రమక్రమంగా నిబంధనలు ఎత్తివేస్తూ కోడెమొక్కు చెల్లింపు, స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, తలనీలాల సమర్పణకు అధికారులు అనుమతించారు. ప్రస్తుతానికి స్వామివారి రుద్రాభిషేకం, అన్నపూజ, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించడంపై నిషేధం కొనసాతున్నప్పటికీ ఆలయంలోకి ప్రవేశించిన భక్తుల ఆరోగ్య పరిరక్షణ అంశాన్ని ఎవరూ పట్టించుకోవం లేదు. భక్తులు మాస్కు ధరించకుండానే, క్యూలైన్లలో కనీస భౌతిక దూరం పాటించకుండానే ఆలయంలోకి చేరుకుంటున్నారు. వేలాది మంది యాత్రీకులు తరలివస్తుండడంతో ఆలయం కిక్కిరిసిపోతోంది. కరోనా వైరస్‌ భయం ఇంకా తొలగని నేపథ్యంలో ఇలాంటి పరిస్థితిని ఎవరు నివారించలన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. మరోవైపు ఆలయ పరిసరాలు, వసతి గదులలో సీసీ కెమెరాలు, మెటల్‌ డిటెక్టర్లు కూడా పనిచేయడం లేదని, వీటి గురించి పట్టించుకనే వారు లేరని పలువురు వాపోతున్నారు.

 గాడి తప్పిన పరిపాలన..


రాజన్న ఆలయంలో పరిపాలన పూర్తిగా గాడితప్పింది. కొంతకాలంగా ఆలయానికి పూర్థి స్థాయి ఈవోను నియమించకపోవడంతో ఆలయ పర్యవేక్షణ, భక్తుల ఏర్పాట్ల విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం రాజన్న ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణప్రసాద్‌ హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయన వేములవాడకు వారంలో రెండు, మూడు రోజులు చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారు. ఈవో స్థానికంగా ఉండకపోవడం, పాలనాపరమైన పర్యవేక్షణ లోపించడంతో ఉద్యోగులలోనూ జవాబుదారీతనం కొరవడిందని, చాలా మంది ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపణలున్నాయి. చాలా మంది ఉద్యోగులు కరీంనగర్‌ నుంచి రోజూ వచ్చిపోతూ ఉండడంతో వేళకు విధులకు హాజరుకావడం లేదు.  రాజన్న ఆలయానికి ఎందుకు పూర్తి స్థాయి ఈవోను నియమించడం లేదన్న ప్రశ్నకు ప్రభుత్వమే జవాబు చెప్పాలి.

 మంత్రిగారూ.. స్పందించండి..


ఐదేళ్లుగా కాగితాలపై డిజైన్లు, గ్రాపిక్‌లతో ఆకర్షిస్తోన్న రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని భక్తులు కోరుతున్నారు. మహాశివరాత్రి జాతర నిర్వహణపై కొన్నేళ్లుగా ప్రత్యేక ఆసక్తి చూపిస్తూ అదనపు నిధులు మంజూరు చేయిస్తున్న మంత్రి కేటీఆర్‌ వేములవాడ ఆలయంలో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన వ్యవహారంపై పూర్తిస్థాయిలో సమీక్ష జరపాలని స్థానికులు కోరుతున్నారు. జాతర ఏర్పాట్లపై సోమవారం ఆలయ ఆవరణలో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో మహాశివరాత్రి జాతరకు తరలివచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో ఆలయ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేయాలని వారు కోరుతున్నారు. 

 భక్తులకు సౌకర్యాలపై దృష్టి సారించాలి..

-ప్రతాప రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో అధికారుల వైఖరి సరిగా లేదు. వసతి, దర్శనం, ఆర్జిత పూజల చెల్లింపు కోసం భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు ఏమాత్రం పాటించని ఆలయ అధికారులు, అవే నిబంధనలను సాకుగా చూపించి అభిషేకం, అన్నపూజ వంటివి ప్రారంభించడం లేదు. ఆలయ నిర్వహణ విషయంలో ప్రభుత్వం, దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైంది. మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న తరుణంలో అఽదికారులు నిర్లక్ష్యం వీడి తగిన ఏర్పాట్లు చేయాలి.

Updated Date - 2021-02-01T06:08:11+05:30 IST