లక్ష్యం నీరుగారుతోంది...

ABN , First Publish Date - 2021-10-20T05:48:26+05:30 IST

భూగర్భజలాలను పెంపొందిం చేందుకు ప్రవేశపెట్టన జలశక్తి అభియాన్‌ పథకం లక్ష్యం జిల్లాలోని మున్సిపాలిటీల్లో నీరుగారిపోతోంది.

లక్ష్యం నీరుగారుతోంది...

- జలశక్తి అభియాన్‌పై బల్దియాల్లో నిర్లక్ష్యం

- మూడేళ్లుగా ఇంకుడు గుంతల ఊసెత్తని యంత్రాంగం

- వృథాగా పోతున్న వాననీరు

- వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు

జగిత్యాల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): భూగర్భజలాలను పెంపొందిం చేందుకు ప్రవేశపెట్టన జలశక్తి అభియాన్‌ పథకం లక్ష్యం జిల్లాలోని మున్సిపాలిటీల్లో నీరుగారిపోతోంది. వర్షాకాలంలో ప్రతీ వర్షపు చుక్కను ఒడిసి పట్టేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మూడేళ్లుగా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో పట్టణాల్లో చిన్నపాటి వర్షం కురిసినా నీరంతా రోడ్లపైకి వచ్చి వీధులు జలమయమవుతున్నాయి. ప్రధాన కూడళ్లతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 2016లో ప్రారంభమైన ఈ పథకం అమలును అధికారులు విస్మరించారు. ప్రభుత్వ ఆదేశాలను మున్సిపల్‌ ఇంజనీర్లు, ప్రణాళిక అధికారులు బేఖాతరు చేస్తున్నారు. పట్టణంలో నిర్మిస్తున్న నూ తన గృహాల అనుమతిలో తప్పక ఇంకుడు గుంత నిర్మాణానికి నిర్ణీత రుసుమును వసూలు చేయాల్సి ఉంటోంది. అధికారుల నిర్లక్ష్యంతో పట్ట ణంలో ఇంకుడు గుంతల నిర్మాణం జరుగడం లేదు. ఈ పథకం గురించి అధికారులకే సరైన అవగాహన లేకపోవడం ఇందుకు నిదర్శనం.  జగిత్యా ల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాల్టీల్లో జలశక్తి అభి యాన్‌ పథకం అమలును గాలికి వదిలేశారు.

నామమాత్రంగా ఇంకుడు గుంతలు....

జిల్లాలోని అయిదు మున్సిపాల్టీల్లో 60,455 భవనాలున్నాయి. రాయికల్‌ మున్సిపల్‌లో 4,573 భవనాలు, జగిత్యాల మున్సిపల్‌లో 23,204, కోరుట్ల మున్సిపల్‌లో 16,423 భవనాలు, మెట్‌పల్లి మున్సిపల్‌లో 12,082 భవ నాలు, ధర్మపురి మున్సిపల్‌లో 4,173 భవనాలుండగా 3,158 భవనాలు న్నాయి. భూగర్బ జలాలు పెంపొందించేందుకు భవనాల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. ఇప్పటి వరకు జిల్లాలోని మెట్‌పల్లి మున్సిపల్‌లో 30 ఇంకుడు గుం తల నిర్మాణాలు మినహా ఎక్కడా నిర్మాణాలు జరగలేదు. ఈ పథకం కింద ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, నీరు నిలిచే ప్రదేశాల్లో సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమై న ఆదేశాలున్నాయి. ప్రతీ మున్సిపాలిటీలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌  వరకు ప్రత్యేకంగా ఇంకుడు గుంతలు నిర్మించాలనే లక్ష్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశించాయి. బల్దియా అధికారులు ఈ ఆదేశాలను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

కొరవడిన నిర్వహణ...

జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో సాధారణంగానే ఇంకుడు గుంతల నిర్మాణాలు పలు ప్రాంతాల్లో స్వల్ప సంఖ్యలో జరిగాయి. పట్టణాల్లో గల పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక ఇంకు డు గుంతల నిర్మాణాలు గతంలో జరిపారు. వాటిలో వరద నీరు చేరడం తో పూడిక తీయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఇంకుడు గుంతలు నిర్మించి వాటిని పట్టించుకోకపోవడంతో వాటి ఆనవాళ్లు కనబడ కుండా పోయాయి. దీంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరి వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టణంలో ఇంకుడు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇంకుడు గుంతలతో ప్రయోజనాలు...

ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకుంటే పట్టణంలో మురికి కాలువలు లేకుండా పోతాయి. వేసవిలో నీటి ఎద్దడి నివారించుకోవచ్చు. పారిశుధ్యం మెరుగు పడటమే కాకుండా వర్షాకాలంలో వరద నీరు ఇళ్లలోకి చేరకుండా ఉంటుంది. ప్రస్తుతం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలో ముప్పు తప్పుతుంది.

అధికారుల్లో సమన్వయ లోపం...

పట్టణాల్లో ఏటా ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రణాళికలు రూపొం దించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్‌ విభాగం, పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల సమన్వయ లోపంతో ఈ పథకం జిల్లాలో నీరుగారిపోతోంది. ప్రాథమికంగా కూడా ఈ ఏడాది కసరత్తు ప్రారంభించలేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇంకుడు గుంతలతో భూగర్భజలాలు పెరుగడంతో పాటు వరదలు తగ్గించే జలాలు పెరుగడంతో పాటు వరదలు తగ్గించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన పెంపొందాలి

- అల్లాడి ప్రభాకర్‌, ఇన్నోవేటర్‌, జగిత్యాల జిల్లా

ఇంకుడు గుంతల నిర్మాణాలపై పట్టణాల్లోని ప్రజలకు అవగాహన పెంపొందించాలి. ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించాలి. గతంలో మెట్‌పల్లి మున్సిపల్‌లో వినూత్న తరహాలో మురికి కాలువలు, వాటర్‌ ప్లాంట్లు, బోరింగ్‌ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాము. మరింత విరివి గా ఇంకుడు గుంతల నిర్మాణాలు జరగాలి.

జలశక్తి అభియాన్‌ పక్కాగా అమలు చేయాలి

- మోరపల్లి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, జగిత్యాల

జిల్లాలోని మున్సిపాల్టీల్లో జల శక్తి అభియాన్‌ పక్కాగా అమలు చేయా లి. ఇంటింటికీ ఇంకుడు గుంతలను ఉద్యమంలా నిర్మించాలి. కొత్తగా ని ర్మిస్తున్న భవనాల వద్ద కచ్చితంగా ఇంకుడు గుంతలను నిర్మించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల సముదాయాల వద్ద నిర్మాణాలు జరిగేలా జాగ్రత్తలు వహించాలి.


Updated Date - 2021-10-20T05:48:26+05:30 IST