పాట మూగబోయింది..
ABN , First Publish Date - 2021-02-07T05:07:09+05:30 IST
ప్రజా కవి, కళాకారుడు, గాయకుడు, ప్రజానాట్య మండలి రాష్ట్ర మాజీకార్యదర్శి సీహెచ్ జాకబ్ కన్నుమూశారు.

- ప్రజాకవి జాకబ్ కన్నుమూత
- పలువురి సంతాపం
గోదావరిఖని, ఫిబ్రవరి 6: ప్రజా కవి, కళాకారుడు, గాయకుడు, ప్రజానాట్య మండలి రాష్ట్ర మాజీకార్యదర్శి సీహెచ్ జాకబ్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. రెండేళ్లుగా హృద్రోగంతో చికిత్స పొందుతున్న జాకబ్ కోలుకున్నారు. కానీ అకస్మాత్తుగా శనివారం తుదిశ్వాస వదిలారు. 47సంవత్సరాలుగా సాంస్కృతిక, సాహిత్య లోకంలో కవిగా, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా విశేష అనుభవం గడించిన గజల్ గాయకుడు జాకబ్.1974 లో ప్రజానాట్య మండలిలో చేరి రాష్ట్రకార్యదర్శిగా, ప్రస్తుతం ఇప్టా జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. కోల్ ఇండియాకు సింగరేణి తరపున దాదాపు 20 సంవత్సరాలు కల్చరల్ మీట్ ప్రాతినిధ్యం వహించడమే కాక జాతీయ స్థాయి లో ఎన్నో బహుమతులను జాకబ్ సాధించారు. రచయితగా 100 ప్రజాపాటలు రచించడంతో పాటు భూ బాగోతం నృత్యనాటిక,కోలేరోళ్లు వీధినాటికలు వందలాదిగా ప్రదర్శనలు ఇవ్వడం ఆయనకు సాటి లేరు. ప్రఖ్యాత సినీ నటులు నాగభూషణం, మాదల రంగారావు, నారాయణరావు, రంగస్థలప్రముఖులు నల్లూరి వెంకటేశ్వర్లుతో సాన్నిహిత్యం కలిసిన జాకబ్ నల్ల బంగారు నేల సింగరేణిలో 1959లో గోదావరిఖనిలో జన్మించిన జాకబ్, 1974లో సింగరేణి కార్మికుడిగా చేరారు. ఏఐవైఎఫ్‌లో క్రియాశీలకంగా పని చేశారు. దాదా పు 41సంత్సరాలు సేవలందించి 2019 జనవరిలో సింగరేణిలో ఉద్యోగ విరమణచేశారు. వాగ్గేయ కళాకారుడు గో రటి వెంకన్న, నిస్సార్, కార్టూనిస్టు మోహన్‌తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న జాకబ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన మృతి చెందడం ప్రజానాట్య మండలితో పాటు సీపీఐకి తీరనిలోటని పలువురు సంతాపం తెలిపారు.