రైస్‌ మిల్లర్ల మాయాజాలం

ABN , First Publish Date - 2021-12-07T06:13:08+05:30 IST

రుగాలం కష్టించి పంట పండించినా మిల్లర్లు నిండా ముంచుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రైస్‌ మిల్లర్ల మాయాజాలం

- అదనపు తూకం వేసిన ధాన్యం అన్‌లోడింగ్‌

- తరుగు పేరుతో అదనపు కటింగ్‌

- రైతుల్లో ఆందోళన 

- క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు

జగిత్యాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి పంట పండించినా మిల్లర్లు నిండా ముంచుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి ధాన్యం 40 కిలోల సంచికి 2 నుంచి 5 కిలోల వరకు తరుగు పేరుతో మిల్లర్లు కాజేస్తున్నారన్నారని రైతులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌లో కూడా తేమ శాతం సరిగా లేదని, తప్ప, తాలు పేరుతో మిల్లర్లు కటింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. పలు చోట్ల ధర్నాలు చేస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. దీనిపై అధికారులకు సైతం ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపిన అధికారులు పలువురు మిల్లర్లకు  నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 410  కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 4వ తేదీ వరకు 30,415 మంది రైతుల నుంచి రూ. 374.39 కోట్ల విలువ గల 1,16,522 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసి ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేశారు. ఇందులో 1,73,616 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఆన్‌లైన్‌ ద్వారా రైతులకు రూ. 165.56 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. 


బస్తాకు కిలో నుంచి ఐదు కిలోలు అధికంగా తూకం


ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం బస్తా ఒక్కంటికి 40 కిలోల ధాన్యం నింపాల్సి ఉంటుంది. గన్నీ బ్యాగు బరువుతో కలుపుకొని 40 కిలోల 650 గ్రాముల ధాన్యం బస్తాలను లోడింగ్‌ చేయాల్సి ఉంటుంది. కొంత మంది రైస్‌ మిల్లర్లు ధాన్యంలో తాలు, తప్ప, తేమ, నూక శాతం కారణాలుగా చూపుతూ కిలో నుంచి 5 కిలోల వరకు అధికంగా తూకం వేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. 40 కిలోల ప్రకారం లోడింగ్‌ చేసిన లారీలను పక్కన పెట్టి అదనంగా తూకంతో లోడ్‌ చేసిన లారీలను మిల్లర్లు అన్‌లోడ్‌ చేసుకుంటున్నారని ఫిర్యాదులున్నాయి. మిల్లర్ల తీరును వ్యతిరేకిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాలలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. రహదారులపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రధానంగా జిల్లాలోని కథలాపూర్‌ మండలం భూషన్‌రావుపేట, సిరికొండ, మల్లాపూర్‌ మండలంలోని దాంరాజ్‌పల్లి, కోరుట్ల మండలంలోని ఏకిన్‌పూర్‌, గొల్లపల్లి మండలం తుంగూరు, బీర్పూర్‌ మండలంలోని కుమ్మనూరు తదితర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల సాకులను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన జరిపారు.


ధ్రువీకరించని ధాన్యం అన్‌లోడ్‌


నిబంధనల ప్రకారం వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన ధాన్యం రైస్‌ మిల్లర్లు కొనుగోలు చేయడం, అన్‌లోడింగ్‌ చేసుకోవాలి. జిల్లాలోని కొందరు రైస్‌ మిల్లర్లు కొన్ని చోట్ల వ్యవసాయ శాఖ అధికారులు నాణ్యత ధ్రువీకరించని ధాన్యం కూడా కొనుగోలు చేసి రైస్‌ మిల్లులకు రవాణా చేస్తున్నారని సివిల్‌సప్లయి అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి నివేధికలను సమర్పించాలని జిల్లా పౌరసరాఫరా అధికారి చందన్‌కుమార్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు. తహసీల్ధార్లు, నాయబ్‌ తహసీల్ధార్లు, పౌరసరఫరా శాఖ ఇన్స్‌పెక్టర్లు క్షేత్ర స్థాయిలో కేంద్రాలను సందర్శించి పరిశీలన జరుపుతున్నారు. ప్రధానంగా ఆరోపణలు వస్తున్న పెగడపల్లి, మల్యాల, సారంగపూర్‌, బుగ్గారం, బీర్పూర్‌, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, కోరుట్ల, రాయికల్‌, జగిత్యాల రూరల్‌, జగిత్యాల అర్బన్‌, ధర్మపురి, వెల్గటూరు, గొల్లపల్లి మండలాల్లోని 15 కేంద్రాలను అధికారులు సందర్శించి పరిశీలన జరిపారు. తగు చర్యల నిమిత్త ఉన్నతాధికారులకు విన్నవించనున్నారు. 


పౌరసరాఫరా శాఖ నోటీసులు


 ధాన్యం దిగుమతి చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైస్‌మిల్లర్లను అధికారులు గుర్తించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 135 రైస్‌ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరిపారు. ఇందులో 62  పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు, 73 రారైస్‌ మిల్లులున్నాయి. జిల్లాలో కొంత మంది బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడంలో వెనుకంజలో ఉన్నట్లు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపిన అధికారులు 32 రైస్‌ మిల్లులు ధాన్యం దిగుమతి చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అధికారులు తేల్చారు. త్వరితగతిన ధాన్యం దిగుమతి చేసుకోకుంటే కస్టం మిల్లింగ్‌ యాక్ట్‌  2015 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని 32 రైస్‌ మిల్లుల యజమానులకు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి నోటీసులు పంపారు. కలెక్టర్‌ రవి ఏరోజుకారోజు పలు కేంద్రాలను సందర్శించడం, సంబందిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు, రవాణా, రైస్‌మిల్లులలో అన్‌లోడింగ్‌ సక్రమంగా జరుగుతుందా అన్న చర్చ రైతాంగంలో చోటుచేసుకుంది.


మిల్లర్లకు నోటీసులు జారీ చేశాం


- చందన్‌కుమార్‌, జిల్లా పౌరసరాఫరా శాఖ అధికారి, జగిత్యాల


జిల్లాలో సకాలంలో ధాన్యం అన్‌లోడింగ్‌ చేసుకోని రైస్‌మిల్లర్ల జాబితా రూపొందించాం. ఇప్పటికే 32 రైస్‌ మిల్లులకు నోటీసులు జారీ చేశాం. తాలు, తప్ప, తేమ శాతం, నూక అధికంగా వచ్చే అవకాశం ఉందని ధాన్యం అన్‌లోడింగ్‌ చేసుకోవడం లేదు. 40 కిలోలకు మించి బస్తాలలో నింపాలని పేర్కొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై పరిశీలన జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటాం. Updated Date - 2021-12-07T06:13:08+05:30 IST