తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల కృషి ఎనలేనిది
ABN , First Publish Date - 2021-09-04T05:18:53+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కృషి ఎనలేనిదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

- నేను కూడా రిటైర్డ్ ఉద్యోగి బిడ్డనే..
- ఈటలకు ఓటమి భయం పట్టుకుంది
- కేసీఆర్ ఆర్టీసీని కాపాడుతుంటే.. కేంద్రం రైల్వే, విమానాశ్రయాలను అమ్ముతోంది
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
హుజూరాబాద్, సెప్టెంబరు 3: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కృషి ఎనలేనిదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌లోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్‌లో విశ్రాంతి ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ మంచి వేతన సవరణ చేసినందుకు కృతజ్ఞత సభ పెట్టుకున్నామని, రిటైర్డ్ ఉద్యోగులు కోరితే వచ్చానన్నారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు కూడా ఆసరా పింఛన్లు ఇచ్చేలా శాయశక్తిలా కృషి చేస్తానన్నారు. టీఆర్‌ఎస్ 30శాతం ఫిట్‌మెంట్ ఉద్యోగులకిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం 7.5శాతమే ఇచ్చింది.. కేంద్రం ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలన్నారు. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే ప్రస్టేషన్‌తో నాపై కూడా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నాడు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ టీఆర్‌ఎస్ జెండా ఎగరేసి వచ్చిన తాను క్రమశిక్షణ కలిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తననన్నారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండి ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ మాట తప్పని వ్యక్తిని అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. ప్రతిసారి అంతకుముందు కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నానన్నారు. పనిచేయకపోతేనే ఇన్నిసార్లు గెలిపిస్తారా..? మాట మీద నిలబడకుంటేనే గెలిపిస్తారా అని అన్నారు. నేను ఆరుసార్లు గెలిస్తే.. ఐదుసార్లు ప్రత్యేర్థులు డిపాజిట్లు గల్లంతయ్యాయని, ఒక్కసారి గాలి రావచ్చు.. ఇన్నిసార్లు గెలుస్తామా అన్నారు. 4వేల ఇళ్లు మంజూరు చేస్తే ఈటల రాజేందర్ ఒక్కటి కూడా పూర్తి చేయలేదని చెప్పాను, ఆయనతో పాటు ఇళ్లు మంజూరు చేయించుకున్న మంత్రులంతా గృహప్రవేశాలు చేయించారని, ఈటల మాత్రం చేయలేదని చెప్పానన్నారు. దేశంలో అధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణగా ఎదిగి, 3కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారన్నారు. ఆర్టీసీకి ఏడాదికి 2వేల కోట్లు ఇచ్చి సీఎం కేసీఆర్ కాపాడుతుంటే.. కేంద్రం రైల్వేలు, విమనాశ్రయాలు, నౌకశ్రయాలు అమ్ముతోందన్నారు. గతంలో పీఆర్సీ ఆలస్యమైతే ఎరియర్స్ ఇచ్చేవాళ్లు కాదు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రిటైర్డ్ ఉద్యోగులకు ఎరియర్స్ ఇచ్చారన్నారు. బండి సంజయ్ బీజపీ నుంచి ఎంపీగా గెలిచి ఈ ప్రాంతానికి చిన్న పనైనా చేశారా అని ప్రశ్నించారు. గెల్లు శ్రీనివాస్ చాలా పేదోడు.. ఆయనకు రెండు గుంటల ఆస్తి మాత్రమే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యాన్ని చూసి కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. మాకు ప్రజలు ఆస్తి... వారి అండతో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక, వైస్ చైర్‌పర్సన్ కొలిపాక నిర్మల, రాజయ్యయాదవ్, హనుమంత్‌గౌడ్, గోపాల్‌రావు, అంజయ్య, రాజయ్య, పీజే స్వామి, మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి హరీష్‌రావు సమక్షంలో ఇల్లందకుంట, మల్లన్నపల్లి గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్‌రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో పసునూటి రాజిరెడ్డి, ప్రశాంత్, రాజు తదితరులున్నారు.