బకాయిల భారం
ABN , First Publish Date - 2021-03-21T06:04:26+05:30 IST
జిల్లాలో ట్రాన్స్‌కోకు బకాయిలు భారంగా మారాయి. జిల్లాలోని 18 మండలాల్లో గత నెలాఖరు వరకు సుమారు రూ. 100.92 కోట్లు విద్యుత్ బకాయిలున్నాయి.

- జిల్లాలో రూ. వంద కోట్లకు పేరుకపోయిన విద్యుత్ బిల్లులు
- ప్రభుత్వ సంస్థలు రూ. 42.04 కోట్లు
- ప్రైవేటు బకాయిలు రూ. 58.87 కోట్లు
జగిత్యాల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ట్రాన్స్‌కోకు బకాయిలు భారంగా మారాయి. జిల్లాలోని 18 మండలాల్లో గత నెలాఖరు వరకు సుమారు రూ. 100.92 కోట్లు విద్యుత్ బకాయిలున్నాయి. ఇందులో ప్రభుత్వ సంస్థల బకాయిలు రూ. 42.04 కోట్లు ఉండగా, ప్రైవేటు బకాయిలు రూ. 58.87 కోట్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు విద్యుత్ బకాయిలను వసూళ్లు చేయడంపై ట్రాన్స్‌కో అధికారులు దృష్టి సారిస్తున్నప్పటికీ సకాలంలో చెల్లింపులు జరగక పోవడంతో పేరుకపోతున్నాయి. రూ. వంద కోట్లకు పైగా బకాయిలు ఉండడం వల్ల విద్యుత్ అధికారులు వసూళ్లపై దృష్టి సారించారు.
వసూలు కాని ప్రభుత్వ సంస్థల బిల్లులు
జిల్లాలో ప్రభుత్వ సంస్థ బకాయిలు రూ. 42.04 కోట్లు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ 18.19 లక్షలు, విద్యాసంస్థల బకాయిలు రూ. 1.11 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల బకాయిలు రూ. 8.68 లక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రూ. 40.37 లక్షలు, పోలీస్‌స్టేషన్లు రూ. 7.32 లక్షలు, జగిత్యాల మున్సిపల్ స్ట్రీట్ లైట్లు, వాటర్ వర్క్స్ రూ. 15.94 లక్షలు, ధర్మపురి మున్సిపల్ రూ. 5.81 లక్షలు, రాయికల్ మున్సిపల్ రూ. 76 లక్షలు, మెట్‌పల్లి మున్సిపల్ రూ. 11.99 లక్షలు, కోరుట్ల మున్సిపల్ రూ. 21.61 లక్షలున్నాయి. పంచాయతీరాజ్ పరిదిలోని గ్రామ పంచాయతీల స్ట్రీట్ లైట్లు, వాటర్ వర్క్స్‌లు రూ. 90.62 లక్షలు, గ్రామ పంచాయతీలు రూ. 92.10 లక్షలు, చిన్న నీటి పారుదల రూ. 21.37 కోట్లు, వాటర్ గ్రిడ్ రూ. 13.33 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు 3.08 కోట్లు విద్యుత్ బిల్లులు ఉన్నాయి.
ప్రైవేటులోనూ అదే తీరు..
జిల్లాలో ప్రైవేటు రంగంలో ఎల్‌టీ సర్వీసులు 4,81,840 ఉండగా బకాయిలు రూ. 20.36 కోట్లు, హెచ్‌టీ కేటాగిరి బకాయిలు రూ. 58.87 కోట్లు ఉన్నాయి. ఎల్‌టీ కేటగిలో 3,11,345 గృహ వినియోగదారులుండగా రూ. 10.48 కోట్ల బకాయిలున్నాయి. వాణిజ్యం 30,578 కనెక్షన్లుండగా రూ. 4.07 కోట్లు, పరిశ్రమలు 2,523 కనెక్షన్లుండగా రూ. 80.84 లక్షలు, కాటేజ్ ఇండస్ట్రీస్ 1,006 కనెక్షన్లుండగా రూ. 4.38 లక్షలు, వ్యవసాయ 1,28,686 కనెక్షన్లుండగా రూ. 2.06 కోట్లు, స్ట్రీట్ లైట్స్ 5,881 కనెక్షన్లుండగా రూ. 1.24 కోట్లు, జనరల్ 1,712 కనెక్షన్లుండగా రూ. 1.64 కోట్లు, తాత్కలిక 19 కనెక్షన్లుండగా రూ. 23 లక్షల బకాయిలున్నాయి. జిల్లాలో హెచ్‌టీ కేటగిరిలో 121 కనెక్షన్లుండగా రూ. 38.51 కోట్లు బకాయిలు వసూలు కావాల్సిఉంది. ఇందులో పరిశ్రమలు 83 కనెక్షన్లుండగా రూ. 1.13 కోట్లు, వాణిజ్యం 12 కనెక్షన్లుండగా రూ. 13.18 లక్షలు, ఇరిగేషన్ 23 కనెక్షన్లుండగా రూ. 37.10 కోట్లు, కాలనీల్లో ఒక కనెక్షన్ ఉండగా రూ. 13.21 లక్షలున్నాయి. బకాయిలు వసూలు అయితే విద్యుత్ సంస్థ మరింత మెరుగుగా సేవలందిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.