రైతుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు
ABN , First Publish Date - 2021-10-28T05:32:43+05:30 IST
: రైతుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు
- టీఆర్‌ఎస్ అభివృద్ధికి పట్టం కట్టండి
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
హుజూరాబాద్, అక్టోబరు 27: రైతుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. ఓటుకు 20 వేలు ఇస్తున్నారని, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వారు డబ్బులు, మద్యం, మాంసాన్ని నమ్ముకున్నారని, తాము కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటును నమ్ముకున్నామన్నారు. నెల రోజులుగా బీజేపీ నాయకులు హుజూరాబాద్‌లో గల్లీ గల్లీ తిరిగి కూలగొడతా, అగ్గిపెడతా, ఘోరీ కడతాం అన్నారు తప్ప ప్రజా సమస్యలపై ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పారా.. గెలిస్తే ఏం చేస్తారో చెప్పారా... అని అన్నారు. బీజేపీపై గ్యాస్ బండ పడడం ఖాయమన్నారు. ఎన్నికల తర్వాత గ్యాస్ ధర 200 రూపాయలు పెంచుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజూరాబాద్, జమ్మికుంటలో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఏడేళ్ల బీజేపీ పాలన, ఏడేళ్ల టీఆర్‌ఎస్ పాలన చూసి ఓటు వేయండన్నారు. రాజేందర్ గెలిస్తే ఢిల్లీ వైపు చూడాలని, గెల్లు శ్రీనివాస్ గెలిస్తే గళ్లీలో ఉండి పని చేస్తారన్నారు. ఢిల్లీ పార్టీ గెలవాలా, ఇంటి పార్టీ టీఆర్‌ఎస్ గెలవాలా అని ఆలోచించుకోవాలన్నారు. . కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్: దళితులకు దళితబంధు ఇచ్చింది కేసీఆరే అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రులు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. రైతులకు వడ్డీతో సహా లక్ష వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. హుజూరాబాద్‌లో ఐదు వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని, సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 5.04 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఊరురా వడ్లు కొనుగోలు చేయడానికి కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.