అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్
ABN , First Publish Date - 2021-03-22T05:12:27+05:30 IST
కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్మాణంలో ఉన్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతున్నదని భారత అథ్లెటిక్ సమాఖ్య టెక్నికల్ కమిటీ చైర్మన్ స్టాన్ లీ జేమ్స్ అన్నారు.

- నిర్మాణ పనులను పరిశీలించిన భారత అథ్లెటిక్ సమాఖ్య టెక్నికల్ కమిటీ చైర్మన్
కరీంనగర్ స్పోర్ట్స్, మార్చి 21: కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్మాణంలో ఉన్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతున్నదని భారత అథ్లెటిక్ సమాఖ్య టెక్నికల్ కమిటీ చైర్మన్ స్టాన్ లీ జేమ్స్ అన్నారు. ఆదివారం పాఠశాలలో జరుగుతున్న సింథటిక్ ట్రాక్ పనులను కలెక్టర్, డీవైఎస్‌వో సూచనల మేరకు ఆయన పరిశీలించారు. ట్రాక్ నిర్మాణంలో చేపడుతున్న పలు అంశాలను సూపర్‌వైజర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రాక్ నిర్మాణంతోపాటు క్రీడాకారులకు వామప్ ఏరియాను కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. సింథటిక్ ట్రాక్‌కు పక్కన లాంగ్‌జంప్ పిట్, ట్రాక్ మధ్యలో హైజంప్ ఏరియా, షాట్‌పుట్, జావెలిన్‌త్రో డిస్కస్ త్రో, హైమర్‌త్రో పోల్ వాల్ట్ ఏరియాలను ఏర్పాటు చేయాలన్నారు. క్రీడాకారులకు బాలబాలికలకు వేర్వేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లను ఉండేవిధంగా చూడాలన్నారు. రాష్ట్ర అథ్లెటిక్ సంఘం ఉపాధ్యక్షుడు నందెల్లి మహిపాల్ మాట్లాడుతూ క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్ కోసం సింథటిక్ ట్రాక్ మంజూరయ్యేలా కృషి చేసిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మే చివరి వారంలోపు ట్రాక్ పనులు పూర్తికావచ్చని తెలిపారు. సింథటిక్ ట్రాక్‌తో జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ పోటీల నిర్వహణ అవకాశాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్ సమాఖ్య టెక్నికల్ కమిటీ సభ్యులు సోను శేఖర్‌తోపాటు కడారి రవి పాల్గొన్నారు.