సింగరేణిలో సమ్మె సైరన్‌

ABN , First Publish Date - 2021-12-07T06:33:45+05:30 IST

సింగరేణి నేలపై సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, ఆర్‌కే6 బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం సమ్మె స్థాయికి వచ్చింది.

సింగరేణిలో సమ్మె సైరన్‌

- సంస్థను కాపాడుకునే ప్రయత్నంలో సంఘాలు

- పార్లమెంటరీ స్థాయి పోరాటాలకు గుర్తింపు సంఘం ప్రయత్నం

- 9 నుంచి మూడు రోజులపాటు సమ్మె

గోదావరిఖని, డిసెంబరు 6: సింగరేణి నేలపై సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, ఆర్‌కే6 బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం సమ్మె స్థాయికి వచ్చింది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో సింగరేణిలో సమ్మె అనివార్యం దిశగా సాగుతున్నది. నల్లనేలపై సమ్మె వాతావరణం ఆవహించింది. ఈ సమ్మె మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నది. పరోక్షంగా సింగరేణి యాజమాన్యం కూడా సమ్మెకు సై అని సైగ చేస్తున్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు రోజుల సమ్మె అనంతరం  భవిష్యత్‌ కార్యాచరణ చర్చించుకోని కార్మిక సంఘాలు సమ్మెపైనే దృష్టి సారించాయి. సింగరేణిలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు మాతృ సంస్థలుగా రాజకీయ పార్టీలే ఉన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు సిద్ధమైన సంఘాల్లో బీజేపీకి సరాసరి నష్టం జరగకుండా బీఎంఎస్‌, టీఆర్‌ఎస్‌కు నష్టం జరగకుండా గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ వారి వారి శక్తివంచనలేని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ సాధన ఉద్యమంలో మినహా కార్మిక హక్కుల సాధన, సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు సింగరేణిలో సంఘాలు ఒక్కటైన సందర్భం మళ్లీ ఇదే కావడం విశేషం. సంఘాలతో పాటు సింగరేణి యాజమాన్యం కూడా సమ్మెకు పరోక్షంగా సహకరిస్తున్నదని తెలుస్తోంది. ఇందులో సింగరేణికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణలోని గోదావరిలోయ ప్రాంతంలోని బొగ్గు నిల్వలు కనిపెట్టడం, వాటిని వెలికి తీయడం సింగరేణి సంస్థనే నిర్వహిస్తున్నది. సింగరేణి గుర్తించిన తాడిచర్లను జెన్‌కోకు ఇవ్వడం, జెన్‌కో ప్రైవేటుకు ఇవ్వడం మినహా గోదావరిలోయ ప్రాంతంలో ఇప్పటి వరకు బొగ్గు నిల్వలు ఏ ప్రైవేట్‌ సంస్థకు వెళ్లలేదు. ఇప్పుడు సింగరేణి గుర్తించిన, సింగరేణి ప్రాంతంలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని బొగ్గు మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు చేయడం, అవి టెండర్‌ స్థాయికి రావడం ఆందోళన కలిగించే విషయం. ఈ నాలుగు బొగ్గు బ్లాకులు ప్రైవేట్‌ సంస్థలకు వెళితే సింగరేణి ప్రాంతంలోని మిగిలిన బొగ్గు బ్లాకులను దాదాపు అన్నీ ప్రైవేట్‌ పరం అయ్యే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. ఇప్పుడు అస్తిత్వంలో ఉన్న అండర్‌ గ్రౌండ్‌ గనులు, ఓపెన్‌కాస్టుల్లో ఉన్న బొగ్గు తవ్వుకోవడం మినహా సింగరేణికి భవిష్యత్తే లేకుండా పోతుంది. కనుక ఈ నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మిక సంఘాల  సమ్మెను యాజమాన్యం ఒక కోణంలో సమర్థిస్తున్నది. గతంలో సమ్మె సందర్భంలో వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఇప్పుడు సింగరేణి యాజమాన్యం స్పందిస్తున్నది. దీనికి తోడు టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వైపరిత్యాల నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసే విధంగా కార్మిక సంఘాలకు యాజమాన్యం సూచనలు చేయడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నది. 

సమ్మె విషయంలో రెండు రోజుల క్రితం కార్మిక సంఘాలకు, యాజమాన్యంకు మధ్య జరిగిన చర్చల సందర్భంలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాలు చేయాలని, పార్లమెంట్‌ సభ్యులకు వినతి పత్రాలు ఇవ్వడం, పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తడం, బొగ్గు మంత్రి కార్యాలయాన్ని ఘెరావ్‌ చేయడం లాంటి అనేక పోరాట రాజకీయ ప్రతిపాదనలు ఆ సమావేశంలో రావడం సింగరేణిలో చర్చనీయాంశం అయ్యింది. ఏది ఏమైనా ఐదు జాతీయ కార్మిక సంఘాలు, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌, విప్లవ కార్మిక సంఘాలు మూకుమ్మడిగా సమ్మెకు పూనుకోవడం, యాజమాన్యం కూడా సమ్మె నివారణ చర్యలను అంతగా పట్టించుకోకుండా సమ్మె పట్ల సానుకూలతను కలిగి ఉన్న పరిస్థితుల్లో సింగరేణిలో మూడు రోజుల సమ్మె అనివార్యం కానున్నది.

-  ఎంఎండీఆర్‌ఏ- 2015 యాక్ట్‌తో..

మైన్స్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ రెగ్యులరైజేషన్‌ యాక్ట్‌ 2015(ఎంఎండీఆర్‌ఏ) దేశంలోని బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించే సరళీకృత సవరణలను తీసుకువచ్చింది. దాని ఫలితంగా దేశంలోని అనేక బొగ్గు బ్లాకులు ప్రైవేట్‌పరం అవుతున్నాయి. ఇప్పుడు ఆ ముప్పు తెలంగాణలోని సింగరేణిపై పడింది. 15రోజుల క్రితం ప్రపంచ పర్యావరణం మీద గ్లాస్కో, స్కాట్లాండ్‌ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మోదీ పాల్గొన్నారు. 2030నాటికి భారతదేశంలో కార్బన్‌ ఆధారిత పరిశ్రమలను 40శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దీంతో థర్మల్‌ బేస్‌డ్‌ పరిశ్రమలన్నీ క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది. అందు కోసం దేశంలో ఉన్న బొగ్గు నిల్వలన్నీంటిని పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాల ద్వారా వీలైనంత త్వరగా వెలికి తీసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరకంగా కార్మిక సంఘాలు చేస్తున్న మూడు రోజుల సమ్మె మాత్రమే సరిపోదని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ భావిస్తున్నది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో పార్లమెంటరీ స్థాయి పోరాటాలకు సిద్ధం కావాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రభావ తీవ్రతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఈ బ్లాకులను సింగరేణికే అప్పగించే విధంగా ప్రయత్నించాలని యోచిస్తున్నది. కాగా దేశ వ్యాప్తంగా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత సంవత్సరం జాతీయ కార్మిక సంఘాలు దేశంలోని కోల్‌ ఇండియాతో పాటు అన్నీ బొగ్గు పరిశ్రమల్లో మూడు రోజుల సమ్మె నిర్వహించాయి. కానీ ఫలితం దక్కలేదు. ప్రైవేటీకరణ ముప్పు సరాసరి సింగరేణి నేలపై పడడంతో ఇప్పుడు మళ్లీ మూడు రోజులు సమ్మె జరుగబోతున్నది. ఈ  సమ్మె బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలువరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

-  చర్చలు విఫలం.. 

 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేసి తీరుతామని కార్మిక సంఘాల నాయకులు ఆర్‌ఎల్‌సీ ఎదుట తేల్చి చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని లేబర్‌ కమిషనర్‌ ఎదుట జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చల్లో గుర్తింపు సంఘంతో పాటు ఐదు జాతీయ కార్మిక సంఘాల నాయకులు వెంకట్రావ్‌, మిర్యాల రాజిరెడ్డి, జనక్‌ ప్రసాద్‌, నర్సింహారెడ్డి, రియాజ్‌ అహ్మద్‌, వాసిరెడ్డి సీతారామయ్య, యాదగిరి సత్తయ్య, మంద నర్సింహారావు పాల్గొనగా యాజమాన్యం తరపు నుంచి డైరెక్టర్‌(పా) బలరాంనాయక్‌, జీఎం (పర్సనల్‌ వెల్ఫేర్‌) ఆనందరావు పాల్గొన్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ విరమించుకోవాలని జాతీయ సంఘాల నాయకులు, టీబీజీకేఎస్‌ నాయకులు యాజమాన్యంతో డిమాండ్‌ చేయగా మా పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని, సమ్మెపై ఆలోచించుకోవాలని యాజమాన్యం సూచించినప్పటికీ కార్మిక సంఘాల నాయకులు వినలేదు. తాము సమ్మె చేసి తీరుతామన్నారు. సమ్మెపై పునరాలోచన చేయాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.


Updated Date - 2021-12-07T06:33:45+05:30 IST