కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-21T05:49:28+05:30 IST

జిల్లాలో పోలీస్‌ యంత్రాంగం లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తోంది.

కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌
వ్యాపారులతో మాట్లాడుతున్న సీపీ సత్యనారాయణ

- అనవసరంగా బయటికి వస్తే కేసులు

- ఇప్పటికే వందలాది వాహనాల సీజ్‌

- ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో పోలీస్‌ యంత్రాంగం లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తోంది. అనవసరంగా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వీ సత్యనారాయణ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 20వ తేదీన ముగియాల్సిన లాక్‌డౌన్‌ను ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని రకాల షాపులను తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆ తర్వాత నుంచి తెల్లవారి 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటున్నది. ఈ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి బయట తిరుగుతున్న వారి భరతం పడుతున్నారు పోలీసులు. జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో పెద్దఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ అమలవుతున్నా కూడా ఏమాత్రం కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా ఆ నాలుగు గంటల్లోనే వ్యాప్తిచెందుతున్నది. లాక్‌డౌన్‌ లేని సమయంలో జనం ఒక్కసారిగా బజారులోకి దూసుకువస్తున్నారు. దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, వైన్‌షాపుల వద్ద ఎగబడుతున్నారు. భౌతికదూరాన్ని పాటించడం లేదు. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలను మూసివేయాలని చెబుతున్నా కూడా కొందరు తెరిచే ఉంచుతుండడంతో కరోనా పెరుగుతున్నదని గమనించారు. గురువారం గోదావరిఖనిలో సీపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కూరగాయల మార్కెట్‌ను సందర్శించి లాక్‌డౌన్‌ లేని సమయంలో ఒకరిపై ఒకరు పడి కూరగాయలు కొనుగోలు చేయవద్దని, భౌతికదూరం పాటించాలని, శానిటైజన్‌ను వినియోగించాలని అవగాహన కల్పించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇండ్ల బయట నుంచి ఎవరు కూడా బయటకు రావద్దని, అనారోగ్య సమస్యలు తలెత్తితే మాత్రం ఆసుపత్రులకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. సీపీతో పాటు పెద్దపల్లి డీసీపీ పులిగిళ్ల రవీందర్‌, ఏసీపీలు సారంగపాణి, ఉమేందర్‌, సీఐలు, ఎస్‌ఐలు ప్రధాన కూడళ్ల వద్ద పికెట్‌లు ఏర్పాటుచేయడంతో పాటు, పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 400కు పైగా వాహనాలను సీజ్‌ చేశారు. పలువురిపై కేసులు విధించారు. మాస్కులు లేకుండా తిరిగే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో గ్రామాలు, పట్టణాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకుని కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో కల్తీ మద్యం విక్రయాలు సాగుతుండడం పోలీసుల దృష్టికి వచ్చింది. గోదావరిఖని, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లోని బెల్టుషాపులపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని ఈ సందర్భంగా రామగుండం సీపీ సత్యనారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దని, వస్తే మాత్రం కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2021-05-21T05:49:28+05:30 IST