రామగిరి ఖిల్లాపై శ్రావణ సందడి

ABN , First Publish Date - 2021-08-21T05:42:01+05:30 IST

జిల్లాలోని రామగిరి మండలం బేగంపట్‌, రత్నాపూర్‌ గ్రామాల మధ్య ఉన్న రామగిరి ఖిల్లాపై శ్రావణ సందడి నెలకొంది.

రామగిరి ఖిల్లాపై శ్రావణ సందడి

- గత చరిత్ర వైభవానికి ప్రతీక

- పర్యాటకంగానే గాక ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు

- పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి నోచుకోని వైనం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని రామగిరి మండలం బేగంపట్‌, రత్నాపూర్‌ గ్రామాల మధ్య ఉన్న రామగిరి ఖిల్లాపై శ్రావణ సందడి నెలకొంది. ఆహ్లాదపరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు ఓవైపు.. ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలు.. అబ్బుర పరిచే కళాఖండాలు మరోవైపు.. రాజుల ఏలుబడిలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా ప్రాచీన కళావైభావాన్ని చాటుతూ నేటికీ పర్యాటకులను అలరిస్తు విరాజిల్లుతున్నది. కాకతీయుల కాలం శిల్పకళా పోషణకు పెట్టింది పేరుగా నిలిచింది. వీరి పరిపాలనలోనే రామగిరి దుర్గంపై అపురూప కట్టడాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. లక్ష్మణుడు, ఆంజనేయుడితో పాటు సీతాసమేతుడైన శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో రామగిరి దుర్గంపై విడిది చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దీంతో రామగిరి పర్యాటక కేంద్రంగానే కాక ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్నది. 200 రకాలకు పైగా వన మూలికలను కలిగి ఉన్న ఈ ఖిల్లా ఆయుర్వేద వైద్యానికి పేరొందింది. తెలంగాణలోనే అత్యంత పొడవైన ఖిల్లాగా ప్రఖ్యాతి గాంచింది. ఈ ఖిల్లాను శ్రావణ మాసంలో స్థానికులే గాకుండా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి సందర్శించుకుంటారు. ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న రామగిరి ఖిల్లా గురించి ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

రాముడు నడయాడిన నేల..

రామగిరి ఖిల్లాకు పౌరాణిక చరిత్ర కూడా ఉంది. శ్రీరాముడు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఇక్కడ శివలింగం ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇది రామగిరి ఖిల్లాగా పేరొందింది. ఈ కోటపైన సీతాసమేత శ్రీరాముడు, లక్ష్మణ, హనుమాన్‌ విగ్రహాలతో పాటు శ్రీరాముడి పాదాలు, నంది విగ్రహం కూడా ఉంది. సీతాదేవి స్నానమాచరించిన కొలను కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. రాజుల పాలనలో రామగిరి ఖిల్లా పరిసర ప్రాంతానికి రామగిరి పట్టణం అనే పేరు వచ్చింది. చుట్టు పక్కల గ్రామాలన్నీ వాడలుగా ఉండేవని అంటారు. రాజుల ఆస్థానంలో సంగీత, నృత్య కళాకారులుండే ప్రాంతాన్ని బోగంవాడ అనేవారట. కాలక్రమేణ అది బేగంపేటగా మారింది. రత్నాలు విక్రయించే వీధిని రత్నాపూర్‌గా, పోతన పేరిట ఉన్న వాడను పోతారంగా, ఆయన తల్లి లక్కమాంబ పేరుతో ఉన్న ప్రాంతాన్ని లక్కారం అని, నాగళ్లు నిలిపే చోటును నాగెపల్లి అని, శుక్రవారం సంత జరిగే చోటును శుక్రవారంపేట అని, ఆదివారం సంత జరిగే చోటును ఆదివారంపేటగా, మైదపుపిండి విసురురాళ్లు ఉండే చోటును మైదంబండగా, గుండరాజు పేరున గుండారం గ్రామాలుగా వెలిసినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. 

ఖిల్లా విశేషాలు..

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపట్‌, రత్నాపూర్‌ గ్రామాల మధ్య పొడవైన గుట్ల మధ్యలో ఈ ఖిల్లా ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి మంథనికి వెల్లే రహదారిలో బేగంపేట్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద దిగి ఆటోల ద్వారా బేగంపేట్‌ గ్రామం లోపలికి వెళ్లి 3 కిలోమీటర్ల దూరం కాలినడకన ఈ ఖిల్లాను చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో, ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ ఖిల్లాను సందర్శించడానికి వీలుంటుంది. ఉదయం 8 గంటల వరకే బేగంపేట గ్రామానికి చేరుకునే విధంగా చూసుకోవాలి.

చూడాల్సిన ప్రదేశాలు..

ఈ ఖిల్లాలో ఏడు కోట ప్రవేశ దర్వాజాలు, 15 ఎత్తయిన శత్రు సైనాన్ని పసిగట్టే బురుజులుంటాయి. మొదటి దర్వాజకి కుడి వైపు వెళితే సముద్ర జలపాతం, రెండవ దర్వాజ ప్రవేశంలో కుడి వైపు గోడపైన గల క్రీ.శ. 1556 కాలం నాటి పది పంక్తులలో గల తెలుగు శాసనం కనబడుతుంది. దర్వాజ ప్రవేశించిన తర్వాత ఎడమ వైపుగల అద్భుతమైన పచ్చని కోట, 25 మీటర్ల పొడవుగల అతిపెద్ద ఫిరంగి, నాలుగో దర్వాజపైగల అతిపెద్ద ఫిరంగితో పాటు సృష్టి శిల్పాలతో పాటు ఏనుగుతో పోరాడుతున్న యోధుడి శిల్పం, రెండు తలల గరుత్మంతుడి శిల్పం ఉంటుంది. అలాగే పిల్లల ఫిరంగి ఉంటుంది. ఇది 15 మీటర్ల పొడవు ఉంటుంది. ఆరవ దర్వాజ నుంచి 21 మెట్లు ఎక్కి కోటపై నుంచి కనిపించే మానేరు వాగు వయ్యారాలతో పాటు ఖిల్లాపై గల వివిధ చారిత్రక స్థలాలైన సీతమ్మ స్నానమాడిన కొలను, పసరు బావులు, పసుపు కుంకుమ భరణి, సవతుల బావులు, మాధవీ మండపం, రాముడు ప్రతిష్టించిన శివలింగాలు, హనుమంతుడి విగ్రహం, చరశాలలు, గజశాలలు, ఆశ్వశాలలు, రాజమందిరానికి తరలించిన రాతి నీటి గొట్టాలు, చివరగా సీతారాముల దేవస్థానాన్ని దర్శించుకుని రావచ్చు. 

శ్రావణ మాసంలో సందడి..

వర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడంతో ప్రతి శ్రావణ మాసంలో రామగిరి ఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ దుర్గంపై నుంచి ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై విలువైన వన మూలికలను సేకరిస్తారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పాలకులు చెబుతున్నప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కళా సంపదకు నిలయమైన రామగిరి ఖిల్లా అభివృద్ధి చెందాల్సి ఉంది. 

Updated Date - 2021-08-21T05:42:01+05:30 IST