కిట్లు, వ్యాక్సిన్‌ కొరత

ABN , First Publish Date - 2021-05-05T05:50:55+05:30 IST

జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కిట్లు, వ్యాక్సిన్‌ కొరత

- అరకొరగా కరోనా పరీక్షల నిర్వహణ

- ఇబ్బందులు పడుతున్న బాధితులు

- పెరుగుతున్న కేసులతో భయాందోళన

- జిల్లాలో మరో 308 మందికి కరోనా

పెద్దపల్లి, మే 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా ఉందేమేనని అనుమాన పడుతున్న వాళ్లు పరీక్షల కోసం కేంద్రాలకు వెళ్లి అక్కడ సరిపడా కిట్లు లేక నిరాశతో వెనుతిరుగుతున్నారు. కొవిడ్‌ బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు వ్యాక్సిన్‌ వేసుకుందామనుకుంటే అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. అరకొరగా వ్యాక్సిన్‌, కరోనా కిట్లను సరఫరా చేస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలో రోజుకు ఇద్దరు నుంచి ఆరుగురి వరకు కరోనా చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. వారంరోజుల నుంచి కరోనా కిట్ల కొరత ఉండడంతో కరోనా పరీక్షలను తగ్గించింది. వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్లు, ఇంట్లో కంటాక్టులు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. ఏ లక్షణాలు లేకుండా పరీక్షల కోసం వచ్చేవారికి పరీక్షలు చేయడం లేదు. మంగళవారం జిల్లాలోని మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో, ఓదెల, ఫైవ్‌ ఇంక్లయిన్‌ కాలనీ, అంతర్గాం, రామగుండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు లేక కరోనా పరీక్షలు నిర్వహించ లేదు. ఈ కేంద్రాలకు పరీక్షల కోసం వచ్చిన వాళ్లు వెనుతిరిగి వెళ్లిపోయారు. జిల్లాలో ఇప్పటివరకు 12,183 మందికి కరోనా సోకింది. ఇందులో వంద మంది వరకు మృతిచెందగా, 3వేలమంది వరకు హోం ఐసోలేషన్‌లో, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 562 కేసులు నమోదు కాగా, మంగళవారం 308 మందికి కరోనా రావడం గమనార్హం. అలాగే 45 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తున్నప్పటికీ, సరఫరా లేక గత నాలుగైదు రోజుల నుంచి వ్యాక్సిన్‌ అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. రెండవ డోస్‌ వారికే ఇస్తున్నారు. ఇప్పటివరకు 1,04,650 డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వగా, ఇందులో మొదటి డోస్‌ 95,235 మందికి, రెండవ డోస్‌ 9,415 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. మంగళవారం 1,715 మందికి వ్యాక్సిన్‌ వేశారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి కూడా కరోనా వ్యాక్సిన్‌నే మే ఒకటి నుంచి ఇస్త్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అనేక మంది కొవిన్‌ యాప్‌లో రిజిష్టర్‌ చేసుకున్నారు. ఈ వ్యాక్సిన్లకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదు. 45 సంవత్సరాలు నిండిన వాళ్లంతా కోవిన్‌ యాప్‌లో రిజిష్టర్‌ చేసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే 18ఏళ్లు పైబడిన వారికి ఇప్పట్లో వ్యాక్సిన్‌ ఇవ్వరనే అర్థమవుతున్నది. ఇందు కోసం కొంత సమయం పట్టవచ్చని తెలుస్తున్నది. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వలు లేనందునే జిల్లాకు సరఫరా కావడం లేదని తెలుస్తున్నది. కానీ ఎప్పటివరకు వ్యాక్సిన్‌ వస్తుందోనని అనేక మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా జనాభాలో కేవలం పది శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. కనీసం కరోనా పరీక్షలనైనా పెంచాలని, తమ అనుమానాలను నివృత్తి చేయాలని జిల్లా అధికారులకు ప్రజలు కోరుతున్నారు. 

జిల్లాలో మరో 308 మందికి కరోనా..

జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో 1026 మందికి కరోనా పరీక్షలు చేయగా 308 మందికి కరోనా సోకిందని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు పేర్కొన్నారు. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 12,183కి చేరింది. పెద్దపల్లి పట్టణంలో 9 మందికి, మండలంలో 25 మందికి, సుల్తానాబాద్‌ మండలంలో 26 మందికి, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 23 మందికి, ఓదెల మండలంలో 20 మందికి, ఎలిగేడు మండలంలో 12 మందికి, జూలపల్లి మండలంలో 10 మందికి, ధర్మారం మండలంలో 9 మందికి కరోనా సోకింది. గోదావరిఖనిలో 62 మందికి, యైుటింక్లయిన్‌ కాలనీలో 40 మందికి, రామగుండంలో 12 మందికి, పాలకుర్తి మండలంలో 19 మందికి కరోనా వచ్చింది. మంథని మండలంలో ముగ్గురికి, ముత్తారం మండలంలో 9 మందికి, కమాన్‌పూర్‌ మండలంలో 16 మందికి, రామగిరి మండలంలో 13 మందికి కరోనా సోకిందని వైద్యులు తెలిపారు. మంథని మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన 60 సంవత్సరాల వ్యక్తి, పెద్దపల్లి పట్టణానికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు కరోనాతో కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. మంథని మండలం దుబ్బపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండడంతో స్వచ్ఛంగా లాక్‌డౌన్‌ను పంచాయతీ పాలకవర్గం అమలుచేయాలని నిర్ణయించింది.

Updated Date - 2021-05-05T05:50:55+05:30 IST