టీఆర్‌ఎస్‌ నాయకులకు సిగ్గుండాలి

ABN , First Publish Date - 2021-10-25T06:04:21+05:30 IST

టీఆర్‌ఎస్‌ నాయకులకు సిగ్గుండాలని, వాళ్ల నాయకులను వాళ్లే కొనుక్కోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ నాయకులకు సిగ్గుండాలి
ఇల్లందకుంటలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

- వాళ్ల నాయకులను వాళ్లే కొంటున్నారు

- హుజూరాబాద్‌లో వార్‌ వన్‌సైడే

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్‌కుమార్‌

ఇల్లందకుంట, అక్టోబరు 24: టీఆర్‌ఎస్‌ నాయకులకు సిగ్గుండాలని, వాళ్ల నాయకులను వాళ్లే కొనుక్కోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, టేకుర్తి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో వార్‌ వన్‌సైడ్‌గా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళితులకు టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నారు. అబద్ధాల హరీష్‌రావు ఎక్కడ ఇన్‌చార్జీగా ఉన్న అక్కడ కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈటల రాజేందర్‌ కొట్టిన దెబ్బకు కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. నవంబరు 2న ప్రగతిభవన్‌ ముందు ట్రిపుల్‌ ఆర్‌ (రాజాసింగ్‌, రఘునందన్‌రావు, రాజేందర్‌) సినిమా కేసీఆర్‌కు చూపిస్తామన్నారు.  ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్‌ ఇంట్లో మాత్రం అందరికీ కొలువులచ్చాయని పేర్కొన్నారు. దళితుల సమస్యలను ప్రశ్నిస్తే, ఉద్యోగాలపై నిలదీస్తే ఈటల రాజేందర్‌ను బయటకు పంపించారన్నారు. నియోజకవర్గ ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండి ఆదుకునేది ఈటల రాజేందర్‌ మాత్రమేనని, ఈటలకు టీఆర్‌ఎస్‌ అన్యాయం చేసిందని ప్రజలందరూ గుర్తించారని, టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అక్కడ అబద్ధాల హామీలు ఇవ్వడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లు ఇస్తే ఒక్క ఇల్లు కూడా నిర్మాణ పనులు చేపట్టలేని మూర్ఖుడు సీఎం అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సురేష్‌రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, రమణారెడ్డి, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T06:04:21+05:30 IST