అట్టహాసంగా రాష్ట్ర జూడో జట్ల ఎంపిక పోటీలు
ABN , First Publish Date - 2021-10-29T05:47:10+05:30 IST
కరీంనగర్ జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో గురువారం మంకమ్మతోటలోని సాయిమానేరు పాఠశాలలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్, కేడెట్ బాల బాలికల జూడో పోటీలు అట్టహాసంగా జరిగాయి.

-14 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారుల హాజరు
కరీంనగర్ స్పోర్ట్స్, అక్టోబరు 28: కరీంనగర్ జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో గురువారం మంకమ్మతోటలోని సాయిమానేరు పాఠశాలలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్, కేడెట్ బాల బాలికల జూడో పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈపోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖాధికారి చంద్రశేఖర్‌గౌడ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని అన్నారు. మానేరు విద్యాసంస్థల అధినేత, రాష్ట్ర జూడో సంఘం ఉపాధ్యక్షుడు కడారు అనంతరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులందరూ గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. భారత జూడో సమాఖ్య కోశాధికారి బి కైలాసం యాదవ్, రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ఒక్క క్రీడాకారుడు దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా తయారు కావాలన్నారు. అనంతరం గురువారం అంతర్జాతీయ జూడో దినోత్సవం సందర్భంగా అతిథులు కేక్‌ను కట్‌చేశారు. ఈ పోటీలకు తెలంగాణ జూడో సంఘంలో సభ్యత్వం కలిగిన 14 జిల్లాల నుంచి సుమారు 450 మంది బాల బాలికలు, 100 మంది అధికారులు, కోచ్‌లు, మేనేజర్లు హాజరయ్యారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను నవంబరు 7 నుంచి 14 వరకు పంజాబ్ రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. పోటీల సందర్భంగా మానేరు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ చిన్నారి బుల్లెట్‌బండి పాటపై చేసిన నృత్యం అలరించింది. ఈ కార్యక్రమంలో పోటీల అబ్జర్వర్, జిల్లా యువజన క్రీడాశాఖాధికారి కీర్తి రాజవీరు, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు తుమ్మల రమేశ్ రెడ్డి, జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు నిరంజనాచారి, రాష్ట్ర జూడో సంఘం ఉపాధ్యక్షులు అజీజ్ తదితరులు పాల్గొన్నారు.