సెక్టోరల్‌ అధికారులు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-10-29T05:40:06+05:30 IST

ఈ నెల 30న జరిగే హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా సెక్టోరల్‌ అధికారులు విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ అన్నారు.

సెక్టోరల్‌ అధికారులు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌

 - పోలింగ్‌ సిబ్బందితో కలిసి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలి

- జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌

హుజూరాబాద్‌, అక్టోబరు 28: ఈ నెల 30న జరిగే హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా సెక్టోరల్‌ అధికారులు విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ అన్నారు. గురువారం హుజూరాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లో సెక్టోరల్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజూరాబాద్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి సెక్టోరల్‌ అధికారులు పోలింగ్‌ సిబ్బందితో కలిసి పోలింగ్‌ సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలని ఆదేశించారు. ఓటర్లు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, మాస్కు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వీవీ ప్యాట్లు సున్నితంగా ఉంటాయని వాటిని లైట్ల కింద పెట్టకూడదని సూచించారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి వెళ్లేటప్పుడు వీవీ ప్యాట్లను చెక్‌ చేయవద్దని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లో బ్యాలెట్‌ యూనిట్‌లు, కంట్రోల్‌ యూనిట్లను చెక్‌ చేసుకోవాలని సూచించారు. పోలింగ్‌ రోజు ఉదయం 5:30కు మాక్‌ పోలింగ్‌ నిర్వహించి, పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో వాటిని క్లియర్‌ చేసి సీల్‌ చేసుకోవాలని తెలిపారు. పీవోలు, ఏపీవోలతో సమన్వయం చేసుకొని పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద హెల్త్‌డెస్క్‌, హెల్ఫ్‌డెస్క్‌ ఉండాలన్నారు. ఇందులో ఏఎన్‌ఎమ్‌, ఆశవర్కర్‌ ఉండేలా చూడాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే రిజర్వులో ఉన్న ఈవీఎంలను అందజేయాలని తెలిపారు. పోలింగ్‌ రోజున పోలింగ్‌ ఏజెంట్లు రెండు డోసుల కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం తీసుకరావాలని, ఒక వేళ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తీసుకోకుంటే అర్టీపీసీఆర్‌ సెంటర్‌ నుంచి తెచ్చిన సర్టిఫికెట్‌ చూసి అనుమతించాలని తెలిపారు. ఏజెంటుగా చేసే వ్యక్తి తప్పనిసరిగా ఆ పోలింగ్‌ కేంద్రంలో ఓటరు అయి ఉండాలన్నారు. పోలింగ్‌ ముగిశాక కంట్రోల్‌ యూనిట్‌ బటన్‌ క్లోస్‌ చేసుకోవాలని, ఈవీఎంలు పోలింగ్‌ సిబ్బందితో కలిసి కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ సెంటర్‌కు రావాలని తెలిపారు. అక్కడ స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరచాలని సూచించారు. రిటర్నింగ్‌ అధికారి అనుమతి లేకుండా వెళ్లకూడదని తెలిపారు. సెక్టోరియల్‌ అధికారులకు మెజిస్ట్రీరియల్‌ పవర్స్‌ ఉన్నాయని, పోలింగ్‌ రోజు ఏమైన అవాంఛనీయ సంఘటనలు జరిగితే మేజిస్ర్టీరియల్‌ పవర్స్‌ ఉపయోగించుకోవాలని తెలిపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చూడాలని సెక్టోరియల్‌ అధికారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, హుజూరాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి, సెక్టోరియల్‌ అధికారులు పాల్గొన్నారు.

ర్యాండమైజేషన్‌ ద్వారా పోలింగ్‌ సిబ్బంది ఎన్నిక

హుజూరాబాద్‌ రూరల్‌ : హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనున్న సందర్భంగా పోలింగ్‌ సిబ్బందిని ర్యాండమైజేషన్‌ ద్వారా ఎంపిక చేశామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ అన్నారు. గురువారం హుజూరాబాద్‌లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో మూడవ ర్యాండమైజేషన్‌ను కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తుకృష్ణన్‌ శంకర్‌నారాయణ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి కర్ణన్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 306పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే 306పీవోలు, 306ఏపీవోలు, 612మంది ఓపీవోలను ర్యాండమైజేషన్‌ ద్వారా ఎంపిక చేశామన్నారు. 40శాతం మంది పోలింగ్‌ సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచామని తెలిపారు. ఈ నెల 29న ఉదయం 9గంటలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో పోలింగ్‌ సిబ్బంది రిపోర్టు చేయాలని సూచించారు. అనంతరం పోలింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న మైక్రో అబ్జర్వర్‌లను ర్యాండమైజేషన్‌ ద్వారా ఎంపిక చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3గంటల వరకు మైక్రో అబ్జర్వర్‌ రిపోర్టు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి, నోడల్‌ అధికారి శ్రీధర్‌, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం సీ-విజిల్‌

కరీంనగర్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎన్నికల్లో అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా ప్రజలు ఫిర్యాదు చేసేందుకు బ్రహ్మాస్త్రంగా సీ-విజిల్‌ యాప్‌ను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్‌ యాప్‌ ద్వారా అభ్యర్థులు చేసే అక్రమాలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను స్మార్ట్‌ఫోన్‌లో తీసి సీ-విజిల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే వెంటనే ఆ ఫొటోలు, వీడియోలు జిల్లా ఎన్నికల అధికారికి వెళ్తాయని తెలిపారు. ఇలా వచ్చిన ఫొటోలు, వీడియోలను వెంటనే పరిశీలించి వాస్తవాలుంటే వంద నిమిషాల్లోపు సంబంధిత అభ్యర్థిపై చర్యలు తీసకుంటామని తెలిపారు. ఫొటోలు, వీడియోలు పంపిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. 

Updated Date - 2021-10-29T05:40:06+05:30 IST