దళితబంధుకు రూ. 500 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2021-08-10T05:45:39+05:30 IST

దళితబంధు పథకం అమలుకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్‌ నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.

దళితబంధుకు రూ. 500 కోట్లు మంజూరు
జిల్లాకు 500 కోట్ల రూపాయలు విడుదలైన సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, రీసోర్స్‌ పర్సన్లు, జమ్మికుంటలో దళిత బంధు సంబరాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌

 - 16న సీఎం కేసీఆర్‌ రాక

- తొలి విడతలో ఐదు వేల మందికి 10 లక్షల ఆర్థిక సహాయం

- లబ్ధిదారుల కోసం 825 బస్సుల ఏర్పాటు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

దళితబంధు పథకం అమలుకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్‌ నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ రాహుల్‌ బొజ్జ సోమవారం జీవో నం. 114 జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేసి ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి భావించారు.  హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికచేసి ఈ నియోజకవర్గంలో పథకాన్ని సంతృప్త స్థాయిలో ప్రతి కుటుంబానికి వర్తింపజేయాలని నిర్ణయించారు. 


హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు


నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలకు ఈ పథకం కింద సహాయం అందించడానికి సుమారు రెండు వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్‌ మండలంలో 5,323, వీణవంక మండలంలో 3,678, జమ్మికుంట మండలంలో 4,996, ఇల్లందకుంట మండలంలో 2,586, కమలాపూర్‌ మండలంలో 4,346 దళిత కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 16న హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్‌ గ్రామాల మధ్య లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ పథకానికి శ్రీకారం చుట్టడం ద్వారా తన సెంటిమెంట్‌ జిల్లా అయిన కరీంనగర్‌లో మరో పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. రైతుబంధు పథకాన్ని కూడా ఇదే వేదికపై   ప్రారంభించినందున దళితబంధుకు కూడా ఇక్కడే శ్రీకారం చుట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారు.  ఆయన తన దత్తత గ్రామామైన వాసాలమర్రి పర్యటనకు వెళ్లిన సందర్భంలో దళితబంధును ఈ గ్రామం నుంచే అమలు చేస్తున్నామని, 76 దళిత కుటుంబాలకు 7 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటిరోజే నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. వాసాలమర్రిలోనే ప్రారంభమైన ఈ దళితబంధు పథకాన్ని ఇప్పుడు హుజూరాబాద్‌లో విస్తృతస్థాయిలో అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి ఈ నెల 16న హుజూరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ఇదే నియోజకవర్గానికి చెందిన ఐదు వేల దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందుకోసం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది. నియోజకవర్గ పరిధిలోని 106 గ్రామ పంచాయతీలు, 60 మున్సిపల్‌ వార్డుల నుంచి ఈ లబ్దిదారుల ఎంపిక జరగనున్నది. 


లబ్ధిదారుల ఎంపికపై దృష్టి


ముఖ్యమంత్రి హాజరుకానున్న ఈ కార్యక్రమానికి మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండడంతో జిల్లా యంత్రాంగం లబ్ధిదారుల ఎంపికపై దృష్టిసారించింది. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో దళితబంధు పథకం అమలుపై ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, జిల్లా, మండల ప్రత్యేకాధికారులు, దళితబంధు రీసోర్స్‌పర్సన్లతో సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని, తొలి విడతలో ఐదు వేల కుటుంబాలకు సహాయం అందిస్తామని కలెక్టర్‌ వివరించారు. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఎంపికైన లబ్ధిదారులందరిని ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభకు తరలించడానికి 825 బస్సులను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ అధికారులకు, రీసోర్స్‌ పర్సన్లకు వివరించారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారి, ప్రతి బస్సుకు ఒక రీసోర్స్‌ పర్సన్‌ను ఏర్పాటు చేశామని, వీరంతా సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులను సమావేశానికి తీసుకొచ్చి ఆర్థిక సహయం పొందేలా చూడాలని కలెక్టర్‌ సూచించారు. దళితబంధు పథకం అమలు కోసం జిల్లాకు 500 కోట్ల రూపాయలు విడుదలైన సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, రీసోర్స్‌ పర్సన్లు కేక్‌ కట్‌చేసి సంబరాలు జరిపి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 


దేశానికి దిక్సూచి దళిత బంధు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 


జమ్మికుంట, ఆగస్టు 9: దేశానికి దిక్సూచి దళిత బంధు పథకం అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆన్నారు. సోమవారం దళిత బంధు పథకం కింద మొదటి విడత 500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజక వర్గంలోని ఐదు వేల కుటుంబాలకు మొదటి విడుతలో లబ్ధి చేకూరబోతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ఉందని, ఇలాంటి పథకం గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 16న జరిగే కేసీఆర్‌ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రామన్నపల్లి హనుమాన్‌ గుడికి 25 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగు వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మంజూరు చేస్తే, ఈటల రాజేందర్‌ పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, నన్నపనేని నరేందర్‌, పార్లమెంట్‌ సభ్యులు వెంకటేష్‌ నేత, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, పోడేటి రామస్వామి, పొనగంటి మల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-08-10T05:45:39+05:30 IST