భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించండి
ABN , First Publish Date - 2021-02-26T05:39:27+05:30 IST
భూగర్భగనులు నష్టాల్లో ఉన్నాయని, బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికి తీయాలని డైరెక్టర్(ఆపరేషన్స్, పా) చంద్రశేఖర్ జీఎంలకు సూచించారు.

గోదావరిఖని, ఫిబ్రవరి 25: భూగర్భగనులు నష్టాల్లో ఉన్నాయని, బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని వెలికి తీయాలని డైరెక్టర్(ఆపరేషన్స్, పా) చంద్రశేఖర్ జీఎంలకు సూచించారు. గురువారం స్థానిక ఇల్లందుక్లబ్‌లో ఎనిమిది ఏరియాల జీఎంలు, ఏజెంట్లు, మేనేజర్లు, ఐఈడీ ఇంజనీర్లతో వర్క్‌షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్(ఫైనాన్స్) బలరాం, డైరెక్టర్(ఈఅండ్‌ఎం) సత్యనారాయణ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ 2020-21 కొవిడ్-19 వలన సంస్థ నిర్దేశించిన లక్ష్యం 70మిలియన్ టన్నులకు గాను 50మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించే అవకాశం ఉందన్నారు. 20మిలియన్ టన్నులు చేధించలేకపోతున్నామని, భూగర్భ గనుల్లో 96.50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 44.29లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధించే అవకాశం ఉందన్నారు. భూగర్భ గనులు నష్టాలతో నడుస్తున్నాయని, యంత్రాలను, మ్యాన్‌పవర్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. నష్టాలను తగ్గించుకోవడానికి ఏరియాస్థాయిలో, కార్పొరేట్ స్థాయిలో ఉన్న బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన సమస్యలపై స మీక్షించుకుని నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ఆయన కోరారు. జీఎం(సీపీపీ) నాగభూషణ్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో ఎనిమిది ఏరియాల జీఎంలు, కార్పొరేట్ ఎస్‌డీఎం సుబాని, శ్రీరాంపూర్ జీఎం సురేష్, జీఎం(ఆపరేషన్స్) దేవికుమార్, శ్రీనివాస్, సురేష్‌బాబు, రవి ప్రసాద్, టీవీరావు, శ్రీనివాస్‌తో పాటు ఐఈడీ అధికారులు పాల్గొన్నారు.