అనుసంధానం..అవస్థలు

ABN , First Publish Date - 2021-02-05T06:19:16+05:30 IST

రేషన్‌ సరుకులు అక్రమదారిలో తరలిపోకుండా తరచూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో లబ్ధిదారులు పడుతున్నారు.

అనుసంధానం..అవస్థలు
వేములవాడలో సినారె కళామందిరం వద్ద గేటుకు ల్యాప్‌టాప్‌ కట్టి పనిచేస్తున్న మీసేవా కంప్యూటర్‌ ఆపరేటర్‌

- ఆధార్‌తో ఫోన్‌ నంబరు లింక్‌ కోసం పడిగాపులు 

- సాంకేతిక సమస్యలతో లబ్ధిదారుల ఇబ్బందులు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రేషన్‌ సరుకులు అక్రమదారిలో తరలిపోకుండా తరచూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో లబ్ధిదారులు పడుతున్నారు. గతంలో తీసుకొచ్చిన బయోమెట్రిక్‌, ఐరిస్‌కు అలవాటుపడుతున్న క్రమంలో ఈనెల ఒకటో తేదీ నుంచి ఓటీపీ విధానాన్ని తప్పనిసరి చేసింది. దీంతో ఆధార్‌తో మొబైల్‌ అనుసంధానం చేసుకోవడానికి లబ్ధిదారులు మీ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. గతంలోనే  ఆధార్‌కు మొబైల్‌ నంబరును అనుసంధానం చేశారు. కొంతమంది లబ్ధిదారులు ఫోన్‌ నంబర్లు మార్చుకోవడంతో ఓటీపీ సమస్య వచ్చి పడింది. సాంకేతిక సమస్యలతో మొబైల్‌ నంబర్ల అనుసంధానం ఇబ్బందిగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 26 కేంద్రాల ద్వారా ఆధార్‌ కార్డుకు మొబైల్‌ నంబరు లింక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. జిల్లాలో 19 మీ సేవా కేంద్రాలు, 3 కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, రెండు పోస్ట్‌ ఆఫీస్‌లు, రెండు బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రాల ద్వారా లింక్‌ చేసుకునేందుకు అనుమతులను ఇచ్చారు. 


జిల్లాలో 1,72,826 రేషన్‌ కార్డులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,72,826 రేషన్‌ కార్డులు, 5,02,894 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో  1,58,977 ఆహార భద్రత కార్డులకు 4,67,227 మంది లబ్ధిదారులు, 13,610 అంత్యోదయ కార్డులకు  35,432  మంది లబ్ధిదారులు,  231 అన్నపూర్ణ కార్డులకు 235 మంది లబ్ధిదారులు ఉన్నారు.   వీరికి ప్రతినెలా 44.32 లక్షల కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం బియ్యం పొందడానికి ఓటీపీ విధానం తేవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓటీపీ లేని వారు ఐరిస్‌ స్కానర్‌ ద్వారా రేషన్‌ సరుకులు పొందవచ్చని ఆఽధికారులు స్పష్టం చేస్తున్నా ఐరిస్‌తోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 


లబ్ధిదారుల తిప్పలు 

 జిల్లాలోని 1,72,826 రేషన్‌ కార్డుల్లో 50 వేలకు పైగా కార్డు దారులు మొబైల్‌ లింక్‌ చేసుకోవాల్సి ఉంది. ఐరిస్‌ విధానంలో ఇబ్బందులు ఉండడంతో రేషన్‌ డీలర్లు ఓటీపీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో లబ్ధిదారులు తెల్లవా రడంతోనే ఆధార్‌ కేంద్రాల వద్ద పడిగాపులుకాస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్‌ సమస్యతోపాటు సర్వర్‌ స్లోగా ఉండడంతో రోజుకు కనీసం 40 కూడా అన్‌లైన్‌ లింక్‌ చేయలేకపోతున్నామని మీ సేవా నిర్వాహకులు పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల సిగ్నల్స్‌ అందక ఆరుబయట ల్యాప్‌టాప్‌లు ఏర్పాటు చేసుకొని ప్రయత్నిస్తున్నారు. వేములవాడ కేంద్రంలోని సినారె కళామందిరం వద్ద గేటుకు ల్యాప్‌టాప్‌ కటుకొని పనిచేయడం అందరినీ అశ్చర్య పరిచింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. 

Updated Date - 2021-02-05T06:19:16+05:30 IST